As dead as Dodo - రెండో భాగం

Posted by చంద్రం on 10/10/2012 10:19:00 PM

    ఇది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగిన ఒక సంధర్బంలో రాసుకున్నది. ఈ కవితలో వస్తువుకీ జీవవైవిధ్యానికీ సంబంధం లేదని నేను అనుకోలేకపోయాను.
    మనదేశంలో జీవవైవిధ్య ప్రాముఖ్యతనీ, ప్రభావాన్నీ తెలియచెప్పడానికి ఒక చిన్న ఉదాహరణని చెప్తాను.
    ప్రపంచతీరప్రాంతంలో మన వాటా సుమారు 0.25 శాతం. కానీ తీరప్రాంత జనాభాలో మనవాటా 11 శాతం. ఈ లెఖ్ఖన విస్తీర్ణం, వైశాల్యం కన్నా ఆయా ప్రాంతాల జనసాంధ్రత దృష్ట్యా చూసినా, జీవనాధార పరిస్థితుల దృష్ట్యా చూసినా కూడా మనదేశంలో జీవవైవిధ్య ప్రభావం ఎక్కువే అని తెలుస్తోంది.
    ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం.
    జీవవైవిధ్యాన్ని కోల్పోవడంలో 'వేట' ప్రభావం అత్యంత ముఖ్యమైనది.
    తరువాతే నిర్లక్ష్యం...వగైరా!
    వేట పలురకాలుగా రూపాంతరం చెందుతున్న రోజులివి. వేటాడేటప్పుడు కళ్ళలోకి చూడగూడదనేది వేటలో ప్రాథమిక సూత్రం. వేట స్వభావమే అంత. సర్వకాల సర్వావస్థల్లో కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. ఆకలి...లేదా వినోదం! జంతువులు ఆకలి కోసమే వేటాడతాయి. వినోదం కోసం వేటాడవు. మనమే...! పైన రాసుకున్న కవితలాగా.
    Man chases animals and calls them wild...అని ఈపాటికెప్పుడో మన గుట్టు మనమే విప్పేసుకున్నాం కాబట్టి ఇక ఎందుకూ? ఏమిటీ? అనే తర్కం అనవసరం.
    నిజానికి మనకిప్పుడు వేటాడే తీరికా, అవసరమూ లేదు. 'ఎర' వేయడం నేర్చుకున్నాం. మన దృష్ఠిలో వేటాడం ఇప్పుడు అనాగరికమైన చర్య. 'ఎర' వేయడం వ్యాపారసూత్రం. సాధారణంగా జంతువులు జంతువుల్ని వేటాడేటప్పుడు 'ఎర'వేసి పట్టవు. మాటేసి పడతాయి. కానీ అది అనాగరికం కదా...అందుకే ఇక్కడ మాత్రం ఎర వేయడమే న్యాయం. ఎరకు ఆశపడి, ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటే అది వాళ్ళ బలహీనత.
    ఈ మధ్య మనదేశంలో చర్చనీయాంశంగా మారిన, మీ కందరికీ తెల్సిన ఒక మంచి 'వేట కథ' గుర్తుచేస్తాను.
    మనదేశంలో సుమారు యాబైవేలనించీ లక్షదాకా బియ్యం/వరి రకాలున్నాయని ఒక అంచనా. ఇలాంటివి చాలా రకాల మేధోసంపత్తి హక్కులు మనవి కాకపోవడం ఆశ్చర్యమే కాదు ఆందోళన కలిగించే విషయం కూడా. సాంప్రదాయ వంగడాలకు కొద్దిపాటి మార్పులు చేసి లబ్ది పొందుతున్న మార్కెట్ శక్తుల ఆగడాల ముందు ప్రభుత్వాలే నిస్తేజమవ్వడం మోన్ శాంటో విషయంలో చూసాం. ఒక జాతి సాంప్రదాయ వనరులనే వేటాడి, తన పాదాక్రాంతం చేసుకోగల అమానుష వేట అది. ఇదే తతంగం generic drugs విషయంలో కూడా కనిపించినా అది ఉత్పత్తిదారుడికీ, వినియోగదారుడికీ మేలుచేసేది కాబట్టి ఇక్కడ చర్చనీయాంశం కాదు. వేటకత్తికి ఉండే లేదా ఉండాల్సిన రెండోవైపు పదును తెలియచేయడానికే ఇప్పుడు ప్రస్తావించవలసి వచ్చింది.
    వానపాముల్లాంటి ఎరలు దొరకడం ఇవ్వాళ కొంచెం కష్ఠమేమో గానీ ఇంకా చాలా రకాల ఎరలే మనకివ్వాళ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మీ ఇంట్లో tv ఆన్ చేసి చూడండి. కుప్పలు కుప్పలుగా కావాల్సినన్ని ఎరలు మీ ఇంట్లో దూరతాయి. పేపర్ తెరిచారా...ఎరలు... షాపింగుకెళ్ళారా...ఎరలు... ఉద్యోగం కావాలా, సినిమా ఛాన్సు కావాలా, అమెరికా వెళ్ళాలా, అమ్మాయిని పడేయ్యాలా ...ఎరలు...ఎరలు...! క్రికెట్ పండగ మొదలయ్యిందా...కొత్త సినిమా రిలీజయ్యిందా ...మార్కెట్లోకి కొత్త మాడల్ కారొచ్చిందా...స్వంత ఇల్లు కట్టాలా... ఎరలు... ఎరలు...! నేనిక్కడ కావాలనే చాలా ఉదాహరణల్ని మినహాయిస్తున్నాను. ఈ పాటికే మీకు తగినన్ని స్ఫురించిఉంటాయి కదా.   
    అయితే...
    ఇవి వ్యక్తిగతం.
    ఇందులో జాతికొచ్చిన బెంగేమీ లేదు. పడితే గిడితే మీ బాధలు మీరు పడతారు.
    ఇంకొక రకం ఎరలున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు వరదలా పారేవి. ఎన్నెన్ని ఎరలు? కోటానుకోట్ల మంది జాతిజనుల జీవితాలను సంవత్సరాల తరబడి ప్రభావితం చేసేవి...జాతికి జాతిని ఒకేఒక్క బలహీనతతోనో(మతం), వాగ్ధానంతోనో(ఎన్నో), కుంభకోణంతోనో(ఎన్నెన్ని..) సిగ్గుతో తలొంచుకునేలా చేసేవీ...! రెక్కలుడిగిన డోడోలా మనం నిశ్చేష్టులమైపోయేలా చేసేవీ...ఎవరితో చెప్పుకోవాలో తెలీక నిస్సహాయంగా మనం తలదించుకునేలా చేసేవీ...! మనకు సమస్యలు లేవా? మరి అసహనం ఎందుకు లేదు? గుండెని  జండాలా ఎగరేస్తూ బ్రతకాల్సిన మనం ఎందుకింత ఉదాసీనంగా ఉన్నాం? ఎందుకు మన ఇంటిముందు రోడ్డుని ఏడాదికెన్ని సార్లు వేసినా మనం సంతోషపడుతూనే ఉన్నాం? ఎందుకు కొండల్ని తొలుచుకుపోతున్నా కిమ్మనకుండా చూస్తున్నాం? క్రికెట్ మాచ్ వొస్తున్నప్పుడు కాసేపు కరెంట్ పోతే కలిగే ఆగ్రహం అసలు కరెంటే లేక, పంటలు పండక ఎవరైనా చస్తే ఎందుకు కలగదు? ఊరపిచ్చుకలూ, పెద్దపులులూ, నెమళ్ళదాకా ఎందుకూ...ఇలాగే జరుగుతూపోతే కొన్నాళ్ళకి అడివనేది మిగులుతుందా? రైతనేవాడు మిగులుతాడా? ప్రశ్నించేవాడు కనపడతాడా? డోడోలాగా అంతరించిపోడూ? 'క్విడ్ ప్రో కో' యుగంలో ఏమిచ్చి మన తెగిపోయిన రెక్కల్ని మనం కొనుక్కోగలం?
    ఏమైపోయింది ... దేశానికి దేశం ఒక్కతాటిగా నడిచిన మన చైతన్యం?
    టీవీల్లో గంతులేస్తోంది...వెండితెరమీద విలువలిప్పేస్తోంది...ఫేస్ బుక్కుల్లో మొహం చాటేస్తోంది.
    అంతా అలాగే ఏడుస్తోందని చెప్పలేం కదా? కాదూ...కూడదూ అన్నాసరే, ఎక్కడైనా కొంత మంచీ, చెడూ ఉంటాయి. ఎంతెంత అనేదే ఎప్పుడూ చర్చనీయాంశమౌతుంది.

                                                                                                                  ( మిగతా తరువాయి టపాలో...)