మా ఇంట్లోనే జీవవైవిధ్య సదస్సు...రండి.

Posted by చంద్రం on 9/27/2012 04:29:00 PM



    జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది కదా...సంధర్బోచితంగా ఉంటుందనిపించింది.

    కాంక్రీట్ వనాల్లోంచి వెలివేయబడుతున్న అనేక పక్షుల, జంతువుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో జీవవైవిధ్యం గురించిన సదస్సు మన హైదరాబాదులో జరగటం ముదావహం అని రాస్తే చా...లా మామూలుగా, ఊకదంపుడుగా ఉంటుంది. అంతకన్నా రొటీన్ గా ఈ సదస్సు ముగిసినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ మన ప్రభుత్వం ఈ సదస్సుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా...త్వరలో ముంబైలాంటి మహానగరాల సరసన చేరటానికి పరుగులు తీస్తున్న హైదరాబాద్ నగరం ఇప్పుడు జరుగుతున్న సదస్సు వలన ఎదైనా (ఇప్పటికైనా)ముందుజాగ్రత్తలు తీసుకోవటానికి ఇది తగిన సమయమని గుర్తిస్తుందేమో? చూద్దాం.

    ఓ పక్కన గనుల కుంభకోణాలు,  ధ్వంసమైపొతూన్న అడవులు, అంతరించిపోతున్న జీవజాతులు, (మరీ విషాధమేంటంటే ఇందులో గిరిజన జాతులు కూడా ఉండటం) మరో పక్క శరవేగంగా విస్తరిస్తోన్న నగర పొలిమేరలు...ఇంతా చేస్తే కడివెడు వానకురిస్తే కదలనివ్వని రహదారులు ఓ పక్క...కుండపోతగా వాన కురిసినా చుక్క నీరు పట్టి దాచుకోలేని ప్రాజెక్టులు మరో పక్కన...ఏది చూసినా మనం ఎన్నో ముందు జగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గట్టిగా నొక్కిఛెప్పేవే.

    ఎన్నైనా చెప్పండి...'ముందడుగు' వేసే విషయంలో మన parameters కొంచెం తికమకగా ఉన్నాయనిపిస్తుంది. ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓ సారి మనం ముందుకు వెళ్తున్నామా? వెనక్కెళ్తున్నామా అని అలోచించుకోవటానికి కూడా ఇలాగే ఓ సదస్సు ఒకటి జరిగితే బాగుండుననిపిస్తోంది. సరే, ఇది కుంచెం సీరియస్ యవ్వారం కదా...కానీ ఇంతకన్నా సీరియస్ గా ఇలాంటిదే ఒక సదస్సు క్రమం తప్పకుండా మా ఊళ్ళో రోజూ చాలా పంక్చువల్ గా కొన్నేళ్ళుగా జరుగుతోందంటే నమ్ముతారా?

    మీటింగులు లేవు...పబ్లిసిటీ లేదు...ఊరపిచ్చికలు, ఉడుతలు ఏమైపోయాయన్న వెర్రి గందరగోళం లేదు. ఏం చేస్తే ఈ అంతరించిపోతున్న జీవజాలాన్ని కాపాడగలమన్న కన్ ఫ్యూజన్ లేదు...అర్థంకాని ఉపన్యాసాలు లేవు...భీభత్సమైన presentations లేవు. హోటళ్ళు బుక్ చేసే బాధ లేదు...ఎవ్వరూ వొచ్చి చెప్పేది లేదు...కానీ ఒక జీవవైవిధ్య సదస్సు...నిరంతరాయంగా...ఠంచనుగా ఒక దినచర్యలాగా మా ఊళ్ళో, మా ఇంట్లో జరుగుతోంది. గమ్మత్తేమిటంటే...ఈ సదస్సులో ఆయా జీవులు కూడా పాల్గొంటున్నాయి. నమ్మకం లేదా? గత సంవత్సరం  తీసిన ఫోటోల్ని కింద చూడండి.
























    ఇవి ఆ మద్య ఊరెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు.

    మా ఇంటి బాల్కనీ గోడపైనో...మెట్లమీదో...ఎక్కడో ఓ చోట...కాసింత అన్నం...ఓ బెల్లం ముక్క...లేకపోతే కొద్దిగా బియ్యమో...నూకలో వేసి...ఒక చిప్పలో కొన్ని నీళ్ళు పోసి ఉంచటం కొన్నేళ్ళుగా  మా అమ్మ దినచర్యలో ఓ బాగం.


 
    నేను మొదట గమనించలేదు. పాపం ఎప్పుడూ ఉడతల్ని చూడని మా పిల్లలు "డాడీ, ఉడత.." అంటో ఇక దాని వెనక పరుగులు. వీళ్ళని చూసి అది పరుగులు...కాసేపటికి మా పిల్లలు  వేరే ఆటలో పడి అటు వెళ్ళగానే మళ్ళీ ఉడత తయారు. ఊరెళ్ళినప్పుడల్లా మా పిల్లలకు చిన్నపాటి 'జూ' సిద్దంగా ఉంటుంది.




    ఓ పక్క గోడమీది చిప్పలోని నీళ్ళు తాగడానికి రంగురంగుల పిట్టలు ఠంచన్ గా రావడం...మరోపక్క ఉడతలూ...బెల్లం కోసం గోడంతా బారులు తీరే చీమలు...కింద పూలమొక్కల్లో కనిపించే అందమైన కీటకాలు...గోడకావల బురదలో పొర్లే బర్రెలు, వాటితో సయ్యాటలడే కొంగలూ, పక్కనే ఉన్న స్కూల్ కాంపౌండ్ లో తిరిగే మేకలూ...వెరసి మొత్తంగా మా ఇంట్లో ఒక 'జీవ వైవిధ్య' సదస్సు రోజూ జరుగుతున్నట్టే అనిపించింది నాకు.






    మనం అస్సలు పట్టించుకోం గానీ, మనకు తెలిసిన విషయాలను 'అవును...మాకు తెలుసు' అని చెప్పుకోడానికే మనం ఈ సదస్సులు జరుపుకుంటున్నామేమో అనిపిస్తూంది నాకు. నిజంగా చేయాలంటే, ఏం చేయాలో ఈ ప్రభుత్వాలకు తెలీకనా? మా అమ్మకు తెలిసినపాటి విషయం ఇంతమంది అధికారులకు తెలీదని, అందుకే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారనీ  ఎలా అనుకోగలం?

    డిసెంబర్ 1 వొస్తేగానీ మనకి aids గుర్తుకురాదు. నిండుగా వానలు కురిసి నీళ్ళన్నీ సముద్రం పాలైతేనో...అస్సలు వానల్లేక అలమటించిపోతేనో తప్ప మనకు ప్రాజెక్టులు గుర్తుకురావు. గిరిజనుల ఉనికి గుర్తుకువొచ్చే సమస్యే లేదు. వొచ్చినా ఏంచేస్తాం? పిచికలూ...గ్లోబలైజేషన్ అంటో రాసేస్తాం. అది ఎవడికి అర్థం అవుతుందో, అర్థమై ఏం చేయాలో దేవుడికే తెలియాలిక.

    ఇదంతా ఖర్చు ఎందుకు...సులువుగా ఒక మంచి పరిష్కారం చెప్తాను...సరే, ఎలాగూ మొదలయ్యింది కదా, ఈ సదస్సు గట్రా అయ్యాకా...జీవవైవిధ్యం గురించి నొప్పులు పడే పెద్దమనుష్యులు  మా ఊరికి వొస్తే, మా అమ్మని ఎలాగోలా ఒప్పించి ( ఎందుకంటే...ఇలాంటీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమ్మకి అస్సలు తీరిక ఉండదు...చేతగాని వాళ్ళే మాడ్లాడుతూ ఉంటారనీ, చేతనైన వాళ్ళైతే చేసేస్తుంటారనీ అమ్మ ఎప్పుడూ చెప్పేది నాకు) ఎలాగోలా నాలుగు క్లాసులు ఏర్పాటు చేస్తాను. ఫర్వాలేదు...ఇంటిపనే తప్ప మరేం తెలీదు అనుకోవద్దు. మా అమ్మ మంచి టీచర్ కూడా.

             
     

    బొమ్మలెలా గీయాలని బాపుగారిని అడిగామనుకోండి...ఆయన 'సాధన' అంటారు. ఎవ్వర్ని సాధిస్తే బొమ్మలొస్తాయో తెలీక ఆయన్నే సాధించే మాలాంటి వాళ్ళకి 'అది చేస్తే బొమ్మలేం ఖర్మ...అన్నీ వొస్తాయి కదా' అన్న తెలివిడి మాత్రం ఊంటుంది.  అలాగనీ, ఆ ముక్క ఆ మహానుబావుడికి చెప్పుకోలేం కదా. అందుకనీ (చిన్నపుడు) అమ్మకి చూపించా. అలా ఒక్కసారి నా బొమ్మవంక చూసి..."బొమ్మ గీస్తే ఏ ముక్కకాముక్క లాగా కనిపించకూడదు...బొమ్మంతా ఒకటే ( integrated) అన్నట్టుగా కనిపించాలా" అని వంద art పుస్తకాల గుట్టు విప్పిచెప్పేది.  ఈ రెండు ముక్కలు నాకెన్ని బొమ్మల్ని నేర్పించాయో మీరు ఊహించలేరు. కాబట్టి, అనవసరంగా కంఠశోషపెట్టుకోకండి.  అమ్మనడిగితే గొంతు నొప్పిక్కూడా ఏదైనా మందు చెప్తుంది కానీ...అవసరమా?

    అందుకే...

    అన్నీ ఇచ్చిన భూమితల్లికి, దాన్ని పదిలంగా కాపాడుతున్న మా అమ్మతల్లికి జేజేలు.




***



    (అన్నట్టు...ఇలా బ్లాగులో చాలా ఫోటోలను పెట్టాల్సి వొచ్చినప్పుడు సహజంగానే size పెరిగి, page load అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాంటప్పుడు సాధారణంగా imagesని కావల్సిన sizeకి resize చేసుకుంటుంటాం. ఐతే అంతకన్నా కూడా  imagesని తక్కువ sizeలో save చేసుకోవాలంటే వాటిని విండోస్ లో ఉండే paint లో open చేసి just...save చేయండి. మీ image size దాదాపు సగానికి పైగా తగ్గుతుంది. Image quality కూడా పెద్దగా తగ్గదు. ఇలా చేయడం వల్ల మీ page తొందరగా load అవుతుంది కూడా.)