As dead as Dodo - మొదటి భాగం

Posted by చంద్రం on 10/09/2012 12:47:00 PM





        అపుడెప్పుడో, ఎప్పుడైనా ఒకప్పుడు మనదేశం మీద ఎవరైనా దండయాత్ర చేస్తే మనమేం చేసాం? మన ఇంట్లో ఆడాళ్ళతో సహా చీపుర్లు తిరగేసి కొట్టామా లేదా? ప్రపంచంలో ఒక్కరైనా 'ఛీ...ఏంటీ ఈ భారతీయులూ...ఇలా చేస్తున్నారేంటీ...' అని ఈసడించుకున్నారా? లేదు. కనీసం మన చేతిలో చీపురు దెబ్బలు తిన్నవాళ్ళైనా ' వీళ్ళు అనవసరంగా రెచ్చి పోతున్నారు' అని అనుకున్నారా? లేదు. పైగా, అలా చీపురు తిరగెయ్యని జాతులన్నీ కాల (జీవవైవిధ్య /పరిణామ) క్రమంలో అడుగంటిపోయాయి. survival of the fittest అన్నమాట.

        ఎక్కడో మారిషస్ దీవుల్లో ఒకప్పుడు దర్జాగా, హాయిగా బ్రతికిన 'డోడో' అనే పక్షికి ఇదేమీ తెలీదు. అఖ్ఖర్లేదు కూడా. కానీ, పాపం దానికి ఎగరడం రాదు. పరిగెత్తే కాలంతో పాటూ పరిగెత్తలేక ఆనవాలు కూడా కనిపించకుండా అంతరించిపోయేదాకా పోర్చుగీసు వేటగాళ్ళ చేత వెంటాడబడిందని చరిత్రకారుల భోగట్టా.

        ఇవ్వాళ భూమ్మీద ఎక్కడా 'డోడో' అనే పక్షి ( వెంటాడడానికి కాదు, కనీసం చూడ్డానికి ఫోటో కూడా) లేదు. అక్కడక్కడా దాని ఆనవాళ్ళు అనబడేవి ఉన్నాయి. అవి నేర్పుతున్న చారిత్రక సత్యాలున్నాయి. బ్రతకడానికి మనతోటి జీవజాతులతో మనం ఆడే చెలగాటానికి చేదు గుర్తులున్నాయి. మన ఘనకార్యాల తాలూకూ 'నికృష్ఠమైన మరకలున్నాయి. మారిషస్ దీవుల అందమైన దృశ్యాల్లోంచి తుడిచిపెట్టుకుపోయిన 'డోడో' జ్ఞాపకాలున్నాయి.

        ఐనా, ఎవడిక్కావాలి జ్ఞాపకాలు? జాతులకు జాతులే తుడిచిపెట్టుకుపోయే జ్ఞాపకాల్ని ఇంకా ఎంత కాలం పోగేసుకుందాం?


    నాకెప్పుడో రాసుకున్న కవిత గుర్తుకొస్తోంది.


    నడిచే పూలవనం...
    దారంతా పూలపాన్పనుకుంటుంది.
    తోడేళ్ళు బుసకొట్టే చీకట్లో
    అడివంటుకుంది.
    ఎక్కడినించొచ్చావే అందాలమైనా...
    ఇక్కడికి రావొద్దూ...రావొద్దు.
    మా రస హృదయం గురించి
    నీకంతగా తెలిసినట్టు లేదు.
    అందంగా కనిపించే దేన్నైనా సరే,
    వేటాడి బందించందే మాకు నిద్రపట్టదు.
    పిట్టలంటేనే మాకు ఎంతో ఆపేక్ష.
    ఒకటి...మా జాతీయ పిట్ట...
    మరోటి మా రాష్ట్ర పక్షి.
    ఇక మా ఆడాళ్ళనందరినీ మేం
    అందమైన పిట్టలతో సమానంగా చూసుకుంటాం.
    నెమళ్ళనీ, కుందేళ్ళనే వేటాడుతాం అనుకోవద్దు.
    మా జాతిపిట్టయినా సరే, మేం
    తోడేళ్ళకన్నా క్రూరంగా వేటాడి,
    నంజుకుతింటాం.

                                (తరువాయి భాగం రేపు)

                                                             - చంద్రం