నవ్యదీపావళి

Posted by చంద్రం on 10/26/2011 03:33:00 AM
-విభా

           మన సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిఫలింపచేసేవే మన పండుగలు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ తత్వం. వివిధరకాలైన ప్రాంతీయతలను, ఆచారాల్నీ కూలంకశంగా తెలియజెప్పి, మన కట్టుబాట్లను, ఉనికినీ చాటేవి పండుగలే.జాతీయ పండగలైన వినాయకచవితి, కృష్ణాష్టమి, దసరా, దీపావళీ, రంజాన్, క్రిస్మస్ లను  మనమంతా ఏకమై, మమేకమై ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. కానీ, ఎన్ని పండగలొచ్చినా దీపావళి ప్రత్యేకతే వేరు. నవరసాలు మేళవించిన పండగల్లో దీపావళి అత్యంత ప్రధానమైంది.

         ఇంటి ముంగిట దీపాల ప్రమిదలు వరుసగా కొలువుదీరి, ఇంటికీ, ఊరికీ నవ్యశోభను సంతరిస్తూ ఆహ్లాదం కలిగిస్తాయి. చిరుచీకట్లని పారదోలే మెరుపు సైనికుల్లా నిలబడే ప్రమిద కాంతుల మద్య శ్రీమహాలక్ష్మిని ఆహ్వానిస్తూ ధనలక్ష్మీ పూజ జరుపుకుంటారు. కొత్త అల్లుళ్లకి అలకలు నేర్పించే దీపావళిని మించిన గడసరి పండగ మరేముంటుందీ? కొత్త బావని టపాకాయల సవ్వడితో హడలగొట్టే సరదా, అలిగిన బావగారిని ఆటపట్టించే మరదళ్ల సందడి, నవకాయ పిండివంటలతో అత్తగారు చేసే భారీ ఫుడ్ ఫెస్టివల్...బాంబులమోతల మద్య విరబూసే నవ్వుల పువ్వులు...అన్నీ దీపావళికి మాత్రమే ప్రత్యేకమైన సంతోషాలు.

         మన అన్ని పండగల్లాగే దీపావళికి కూడా ఒక పరమార్థం ఉంది. వర్షాకాలంనుండి శీతాకాలంలోకి ప్రవేశించే క్రమంలో వాతావరణంలో  కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. శీతాకాలంలో రకరకాల క్రిమికీటకాలు వ్యాపించకుండా వాటివల్ల  కలిగే వ్యాధులను నివారించటానికి భాస్వరంలాంటి రసాయనాలతో తయారుచేసిన పటాసులను కాల్చి పండగ చేసుకుంటాం. కాంతులు విరజిమ్మే కాకరపువ్వొత్తులు, వెన్నెలమడుగుల్లాంటి భూచక్రాలు కాలుస్తూ పిల్లా,పెద్దా అందరూ కేరింతలు వేయటం...పండగల్లో దీపావళిని ప్రత్యేకంగా నిలబెడ్తాయి. ఇంటిగుమ్మాలకి కట్టిన మామిడాకులు వాతావరణంలోని కల్మషాన్ని తొలగించినట్టే బంధుమిత్రులతో కలిసి చేసుకునే సంబరాలు మన మనసుల్లోని కల్మషాన్ని కూడా తొలగించి ప్రాణవాయువునందిస్తాయి. అన్ని పండగలను మనం ఇంట్లో జరుపుకుంటే, హోళీ, దీపావళికి మాత్రం వీధులన్నీ వేదికలవుతాయి.
         అనుబంధాలు కనుమరుగవుతున్న నేటికాలంలో ఊరంతటినీ ఏకంచేసే సంబరాల జాతర దీపావళి పండగ. విదేశాలకెగుమతి ఐన మన బిడ్డలు పుటిన గడ్డమీది స్వదేశీ సాంప్రదాయాలను దిగుమతి చేసుకోవడానికి చూపించే ఆపేక్ష హర్షణీయం. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు కూడా మన దీపావళీ పండగని జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే మన పండగల విశిష్టత ఏమిటో చెప్పకనే చెపుతుంది.
అమావాస్య చీకట్లను తొలగించటానికి ఎన్నో దీపాలను వెలిగించినట్టే మనుష్యుల్లో అఙ్ఞానతిమిరాలను పారదోలే ఙ్ఞానాదీపాల్ని కూడా వెలిగిద్దాం. విచక్షణతో, వివేకంతో ప్రపంచీకరణనించి ప్రయోజనాలను పొందడం నేర్చుకుందాం. చిరుదీపాల వరుసతో కాంతిరేఖలు ప్రసరించినట్లే మనిషికి మనిషికి మద్య అనుబంధాలు విస్తరించి...ఆనందం ఆర్ణవమవ్వాలని  ఆశిస్తూ...
          
అందరికీ దీపావళి శుభాకాంక్షాలు..!