స్వాత్ లోయలో పాటకోయిల!
తేది: 9 October 2012
స్టలం: స్వాత్ లోయ, మింగోరా.
స్వాత్ లోయలో...
ముఖానికి మాస్కులు ధరించిన...సాయుధులైన తాలిబాన్లు ఎప్పటిలాగే...బహుశా రోజూలాగే...తమ గన్నులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకోదలుచుకున్నారు. అదేం పెద్ద విషయం కాదు. అప్పుడప్పుడు జరిగేదే. ఆంక్షలు పనిచేయనిచోట గన్నులు పనిచేస్తాయో లేదో పరీక్షించుకోవడం వాళ్ళకి మామూలే. ఇంతకు ముందు చాలా సార్లు జరిగిందే. ఎప్పుడైనా వాళ్ళ గన్నులు పని చేస్తునే ఉన్నాయి. అవి వాళ్ళనెప్పుడూ మోసం చేసింది లేదు.
అదే నమ్మకంతో వాళ్ళు ఒకచోట ఆగి, ఎదురుచూడసాగారు.
అటుగా వొస్తున్న స్కూల్ వాన్ కనిపించింది. స్కూల్ పిల్లలు...పరీక్షలు రాసి ఇళ్ళకి తిరిగొస్తున్నారు. తాలిబాన్లు ముందుకు కదిలి, వాన్ ని ఆపేసారు. బహుశా అందర్నీ కిందకి దిగమనే ఉంటారు. ఎవరిమీద తుపాకి పరీక్షించాలో అని ఆలోచించలేదు వాళ్ళు.
"మీలో మలాలా ఎవరు?" అని ప్రశ్నించారు.
మలాలా యూసుఫ్జాయ్...!
14 ఏళ్ళ అమ్మాయి.
చందమామ లాంటి మొహం.
చదువుకుంటోంది.
పైగా, చదువుకోవద్దని అన్నందుకి...
"How dare the Taliban take away my basic right to education?" అని మిన్ను విరిగి మీద పడేలా ఉరిమింది...BBC సాక్ష్యంగా! పరీక్ష కూడా రాసి వస్తోంది.
"...లేదా మీ అందర్నీ కాల్చేస్తాను" తాలిబాన్ గర్జన.
తన పేరు తాను చెప్పుకోవడం కూడా ఎవరికైనా జీవన్మరణ సమస్యగా మారిన క్షణం అది...! ఆ అమ్మాయికి అలాంటి భయమేం లేదు. పైగా ఇంతకుముందే చెప్పింది కూడా.."వాళ్ళు నన్ను చంపడానికి వొచ్చినా సరే, మీరు మా చదువుకునే హక్కుని కాదనటం సరైంది కాదనే చెబుతాను" అని.
విస్పష్ఠమైన ధిక్కారం.
అది 2009లో తాలిబాన్లు పెట్టిన ఆంక్షలకు విరుద్ధం.
తమ గన్నులు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి 14 ఏళ్ళ మలాలా సరైందని తాలిబాన్లు అర్ఠం చేసుకున్నారు. ఎన్నో సంధర్భాల్లో తమకు సహకరించిన గన్నుల మీదున్న అపారమైన నమ్మకంతో రెండు సార్లు కాల్చారు... తలలో...మెడలో రెండు బుల్లెట్లు!
పనిచేసాయి.
ఎదురుగా రక్తపు మడుగులో మలాలా యూసుఫ్జాయ్.
***
తేది: 15 October 2012
స్టలం:United Kingdom.
మరింత మెరుగైన వైద్యం కోసం మలాలా బర్మింగ్ హామ్ లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ కి మార్చబడింది.
16 October న మలాలా వైద్యానికి స్పందిస్తున్న తీరుకి డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేసారు.
17 October న మలాలా కోమా లోంచి బయట పడింది. ఆమె పూర్తిగా కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని డాక్టర్ల రిపోర్టులు చెపుతున్నాయి.
ప్రస్తుతం మలాలా కోలుకుంటోంది.
ప్రపంచంలోని అత్యంత నిపుణులైన డాక్టర్లు స్వాత్ లోయ పాటకు ప్రాణాలు పోయడానికి రేయింబవళ్ళూ శ్రమిస్తున్నారు.
చదువుకోవాలన్న ఆకాంక్షని అణువణూవునా నింపుకుని చావుని కూడా ధిక్కరించి పోరాడుతోంది ఆ పిల్ల. పోరాటమే జీవితమైన చోట పుట్టి, పెరిగిన మలాలాకి అదొక లెక్క కాదు.
ప్రాణం కంటే కూడా విలువైనదాని కోసం మలాలా యూసుఫ్జాయ్ పోరాడుతోంది.
అది...
" మీ తుప్పుపట్టిన గన్నులు మామీద పనిచెయ్యవు గాక చెయ్యవు. మా ఆకాంక్షల మీద మీ ఆంక్షలు చెల్లవు గాక చెల్లవు" అని తాలిబాన్లకు చెప్పడం.