పాండుని గుర్తు చేసుకుందాం

Posted by చంద్రం on 10/15/2011 07:01:00 PM

         
            మసనం పాండురంగా రావ్ అంటే మామూలుగానైతే ఏ పెద్దాయనో అనుకుంటాం, గానీ మాతో కలిసి బొమ్మలేసిన పాండు అనిపించదు.  అప్పటిదాకా మాతోనే కలిసి బొమ్మలేసిన పాండు, మాలాగే చాలా అవస్థలు పడ్డ పాండు, బహుశా మా అందరికంటే ఎక్కువే బొమ్మలప్రపంచంలో గందరగోళానికి గురైన పాండు...ఉన్నట్టుండి మాయమయ్యాడు. కొద్ది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా పోయాడు. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఎవరో మిత్రుడు పాండు ఎగ్జిబిషనంట..అని పిలిస్తే యథాలాపంగా వెళ్లాం. మాకేం తెలుసూ, పాండు అలా చేస్తాడనీ, అలా బొమ్మలు గీస్తాడనీ?

            నా చుట్టు పక్కల  ఉండే ఎంతోమంది అర్టిస్ట్ లు రకరకాల కోర్సులు చేసి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ, రహస్యంగా పేయింటింగ్ లు ప్రాక్టీస్ చేయడం తెలిసిందే ఇనా...ఎవరికీ పెద్దగా పట్టు చిక్కిందిలేదు. అందరిలాగా పాండు ఉద్యోగం చేస్తూ, పేయింటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అన్నీ వొదిలేసి పోయాడు. ఎక్కడికెళ్లాడో ఎవరికీ (కనీసం నాకు) తెలీదు. సుమారుగా ఒక సంవత్సరం పాటు ఎవరికీ కనిపించలేదు. ఎవరూ కనిపెట్టలేని బోదివృక్షమేదో, ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోయినా దాని క్రింద కూచుని ఙ్ఞానం సంపాయించాడు. సహజంగానే ధీమాగా ఉండే పాండు..."ఇక మనకేం ఫర్వాలేదబ్బా..." అంటో ఎగ్జిబిషన్ పెట్టాడు. అంతా వెళ్లి,చూసి,కళ్లు బైర్లుకమ్మి చాలా రోజులదాకా, బహుశా పాండు అర్థాంతరంగా వెళ్లిపోయే దాకా అదే మాట్లాడుకోవడం జరిగింది. ఎలా జరిగిందీ? పాండుకి ఇదెలా సాధ్యమైందీ? ఇలా ఎలా? లాంటి సవాలక్ష సంబ్రమాశ్చర్యాలని పంచుకోవడం మామూలైపోయింది.

            అందరికీ అర్థం కాకపోయినా పేయింటింగ్ లు వేసి సక్సెస్ కావాలనుకున్న ఎంతోమంది అర్టిస్ట్ లకి పాండు ఎక్కగలిగిన మెట్టు గురించి స్పష్ఠంగానే తెలుసు. పట్టువదలని విక్రమార్కునిలా పాండు మాత్రమే సాధించిన ఫీట్ ఇది.

            దేన్నైనా ఒక్క ముక్కలో తేల్చేయటం పాండుకి వెన్నతో పెట్టిన విద్యని పాండుని తెలిసిన వాళ్లెవరైనా అనుకుంటారు. అలాగే తేల్చేసి వెళ్లిపోయాడు పాండు. మళ్లీ ఎవ్వరికీ కనిపించని చోట, ఎక్కడో కూచుని మరిన్ని మాయలు నేర్చుకుని వొచ్చి, మమ్మల్నందర్నీ ఆశ్చర్యానికి గురిచేయాలని అనుకుంటున్నాడేమో? ఫర్వాలేదు, మా అందరికీ నమ్మకం ఉంది. పాండు ఎక్కడ ఉన్నా దర్జాగా ఉంటాడు. ధీమాగా ఉంటాడు. సడెన్ గా వొచ్చేసి, "అదేం లేదబ్బా.." అంటో మళ్లీ ఏదో ఒకటి చేసినా చేస్తాడు. అప్పటిదాకా, మనం పాండు వెళ్లిపోయాడనే నమ్మాలి,మళ్లీ వొచ్చేదాక.



పాండుకి అశృపూరిత నయనాలతో...
చంద్రం.


            * పాండు బొమ్మలు మీరు ఇక్కడ చూడొచ్చు. (పాండుని గుర్తు చేసుకోవాలనే చనువు తప్ప, ఆ బొమ్మల కాపీరైట్ 
అతిక్రమిస్తున్నానేమో అనే ఆలోచన లేదు. అలాంటిదేదైనా ఉంటే తెలియచేయండి.)