నవ్యదీపావళి

Posted by చంద్రం on 10/26/2011 03:33:00 AM
-విభా

           మన సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిఫలింపచేసేవే మన పండుగలు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ తత్వం. వివిధరకాలైన ప్రాంతీయతలను, ఆచారాల్నీ కూలంకశంగా తెలియజెప్పి, మన కట్టుబాట్లను, ఉనికినీ చాటేవి పండుగలే.జాతీయ పండగలైన వినాయకచవితి, కృష్ణాష్టమి, దసరా, దీపావళీ, రంజాన్, క్రిస్మస్ లను  మనమంతా ఏకమై, మమేకమై ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. కానీ, ఎన్ని పండగలొచ్చినా దీపావళి ప్రత్యేకతే వేరు. నవరసాలు మేళవించిన పండగల్లో దీపావళి అత్యంత ప్రధానమైంది.

         ఇంటి ముంగిట దీపాల ప్రమిదలు వరుసగా కొలువుదీరి, ఇంటికీ, ఊరికీ నవ్యశోభను సంతరిస్తూ ఆహ్లాదం కలిగిస్తాయి. చిరుచీకట్లని పారదోలే మెరుపు సైనికుల్లా నిలబడే ప్రమిద కాంతుల మద్య శ్రీమహాలక్ష్మిని ఆహ్వానిస్తూ ధనలక్ష్మీ పూజ జరుపుకుంటారు. కొత్త అల్లుళ్లకి అలకలు నేర్పించే దీపావళిని మించిన గడసరి పండగ మరేముంటుందీ? కొత్త బావని టపాకాయల సవ్వడితో హడలగొట్టే సరదా, అలిగిన బావగారిని ఆటపట్టించే మరదళ్ల సందడి, నవకాయ పిండివంటలతో అత్తగారు చేసే భారీ ఫుడ్ ఫెస్టివల్...బాంబులమోతల మద్య విరబూసే నవ్వుల పువ్వులు...అన్నీ దీపావళికి మాత్రమే ప్రత్యేకమైన సంతోషాలు.

         మన అన్ని పండగల్లాగే దీపావళికి కూడా ఒక పరమార్థం ఉంది. వర్షాకాలంనుండి శీతాకాలంలోకి ప్రవేశించే క్రమంలో వాతావరణంలో  కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. శీతాకాలంలో రకరకాల క్రిమికీటకాలు వ్యాపించకుండా వాటివల్ల  కలిగే వ్యాధులను నివారించటానికి భాస్వరంలాంటి రసాయనాలతో తయారుచేసిన పటాసులను కాల్చి పండగ చేసుకుంటాం. కాంతులు విరజిమ్మే కాకరపువ్వొత్తులు, వెన్నెలమడుగుల్లాంటి భూచక్రాలు కాలుస్తూ పిల్లా,పెద్దా అందరూ కేరింతలు వేయటం...పండగల్లో దీపావళిని ప్రత్యేకంగా నిలబెడ్తాయి. ఇంటిగుమ్మాలకి కట్టిన మామిడాకులు వాతావరణంలోని కల్మషాన్ని తొలగించినట్టే బంధుమిత్రులతో కలిసి చేసుకునే సంబరాలు మన మనసుల్లోని కల్మషాన్ని కూడా తొలగించి ప్రాణవాయువునందిస్తాయి. అన్ని పండగలను మనం ఇంట్లో జరుపుకుంటే, హోళీ, దీపావళికి మాత్రం వీధులన్నీ వేదికలవుతాయి.
         అనుబంధాలు కనుమరుగవుతున్న నేటికాలంలో ఊరంతటినీ ఏకంచేసే సంబరాల జాతర దీపావళి పండగ. విదేశాలకెగుమతి ఐన మన బిడ్డలు పుటిన గడ్డమీది స్వదేశీ సాంప్రదాయాలను దిగుమతి చేసుకోవడానికి చూపించే ఆపేక్ష హర్షణీయం. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు కూడా మన దీపావళీ పండగని జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే మన పండగల విశిష్టత ఏమిటో చెప్పకనే చెపుతుంది.
అమావాస్య చీకట్లను తొలగించటానికి ఎన్నో దీపాలను వెలిగించినట్టే మనుష్యుల్లో అఙ్ఞానతిమిరాలను పారదోలే ఙ్ఞానాదీపాల్ని కూడా వెలిగిద్దాం. విచక్షణతో, వివేకంతో ప్రపంచీకరణనించి ప్రయోజనాలను పొందడం నేర్చుకుందాం. చిరుదీపాల వరుసతో కాంతిరేఖలు ప్రసరించినట్లే మనిషికి మనిషికి మద్య అనుబంధాలు విస్తరించి...ఆనందం ఆర్ణవమవ్వాలని  ఆశిస్తూ...
          
అందరికీ దీపావళి శుభాకాంక్షాలు..!




కేసీఆర్

Posted by చంద్రం on 10/23/2011 05:20:00 AM

   

        పాత మెయిల్స్ చెక్ చేస్తోంటే అటాచ్ మెంట్స్ లో ఈ బొమ్మ కనబడింది. రాజ్ టీవీ వొస్తున్న రోజుల్లో ఒకానొక ప్రకటన కోసం గీసిన కేసీఆర్ పోర్ట్రెయిట్ 
ఇది. మొదటినించీ నాకు పోర్ట్రెయిట్స్ మీద అంత ఆసక్తి ఉండేది కాదు. అందువలన నేను పోర్ట్రెయిట్స్ వేయడం చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ ఫ్రెండ్స్ బర్త్ డేలకి వాళ్ల కారికేచర్స్ వేసి, గ్రీటింగ్స్ ఇవ్వడం పాత ఆఫీసుల్లో ఒక అప్రకటిత నియమంగా జరిగేది. ఎప్పుడైనా మిత్రులో...బాగా దగ్గరవాళ్లో అడిగితే మొహమాటానికి పోయి,( గీయలేననో, అలవాటు లేదనో చెప్తే నమ్మరనీ ) అప్పుడప్పుడు ఇలా పోర్ట్రెయిట్స్ వేయాల్సివచ్చేది. ఇదీ అలా వేసిందే. 

        
దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ కేసీఆర్ అభిమానులు చేయించిన ఈ యాడ్ సరిగ్గా గత దీపావళినాడు ఆ రోజంతా రాజ్ టీవీలో ప్రసారమైంది. ఐతే, కొసమెరుపు ఏంటంటే ఇది అందరితో పాటూ టీఆరెస్ నాయకుడు హరీశ్ రావుకి బాగా నచ్చడం..!


              

పాండుని గుర్తు చేసుకుందాం

Posted by చంద్రం on 10/15/2011 07:01:00 PM
         
            మసనం పాండురంగా రావ్ అంటే మామూలుగానైతే ఏ పెద్దాయనో అనుకుంటాం, గానీ మాతో కలిసి బొమ్మలేసిన పాండు అనిపించదు.  అప్పటిదాకా మాతోనే కలిసి బొమ్మలేసిన పాండు, మాలాగే చాలా అవస్థలు పడ్డ పాండు, బహుశా మా అందరికంటే ఎక్కువే బొమ్మలప్రపంచంలో గందరగోళానికి గురైన పాండు...ఉన్నట్టుండి మాయమయ్యాడు. కొద్ది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా పోయాడు. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఎవరో మిత్రుడు పాండు ఎగ్జిబిషనంట..అని పిలిస్తే యథాలాపంగా వెళ్లాం. మాకేం తెలుసూ, పాండు అలా చేస్తాడనీ, అలా బొమ్మలు గీస్తాడనీ?

            నా చుట్టు పక్కల  ఉండే ఎంతోమంది అర్టిస్ట్ లు రకరకాల కోర్సులు చేసి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ, రహస్యంగా పేయింటింగ్ లు ప్రాక్టీస్ చేయడం తెలిసిందే ఇనా...ఎవరికీ పెద్దగా పట్టు చిక్కిందిలేదు. అందరిలాగా పాండు ఉద్యోగం చేస్తూ, పేయింటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అన్నీ వొదిలేసి పోయాడు. ఎక్కడికెళ్లాడో ఎవరికీ (కనీసం నాకు) తెలీదు. సుమారుగా ఒక సంవత్సరం పాటు ఎవరికీ కనిపించలేదు. ఎవరూ కనిపెట్టలేని బోదివృక్షమేదో, ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోయినా దాని క్రింద కూచుని ఙ్ఞానం సంపాయించాడు. సహజంగానే ధీమాగా ఉండే పాండు..."ఇక మనకేం ఫర్వాలేదబ్బా..." అంటో ఎగ్జిబిషన్ పెట్టాడు. అంతా వెళ్లి,చూసి,కళ్లు బైర్లుకమ్మి చాలా రోజులదాకా, బహుశా పాండు అర్థాంతరంగా వెళ్లిపోయే దాకా అదే మాట్లాడుకోవడం జరిగింది. ఎలా జరిగిందీ? పాండుకి ఇదెలా సాధ్యమైందీ? ఇలా ఎలా? లాంటి సవాలక్ష సంబ్రమాశ్చర్యాలని పంచుకోవడం మామూలైపోయింది.

            అందరికీ అర్థం కాకపోయినా పేయింటింగ్ లు వేసి సక్సెస్ కావాలనుకున్న ఎంతోమంది అర్టిస్ట్ లకి పాండు ఎక్కగలిగిన మెట్టు గురించి స్పష్ఠంగానే తెలుసు. పట్టువదలని విక్రమార్కునిలా పాండు మాత్రమే సాధించిన ఫీట్ ఇది.

            దేన్నైనా ఒక్క ముక్కలో తేల్చేయటం పాండుకి వెన్నతో పెట్టిన విద్యని పాండుని తెలిసిన వాళ్లెవరైనా అనుకుంటారు. అలాగే తేల్చేసి వెళ్లిపోయాడు పాండు. మళ్లీ ఎవ్వరికీ కనిపించని చోట, ఎక్కడో కూచుని మరిన్ని మాయలు నేర్చుకుని వొచ్చి, మమ్మల్నందర్నీ ఆశ్చర్యానికి గురిచేయాలని అనుకుంటున్నాడేమో? ఫర్వాలేదు, మా అందరికీ నమ్మకం ఉంది. పాండు ఎక్కడ ఉన్నా దర్జాగా ఉంటాడు. ధీమాగా ఉంటాడు. సడెన్ గా వొచ్చేసి, "అదేం లేదబ్బా.." అంటో మళ్లీ ఏదో ఒకటి చేసినా చేస్తాడు. అప్పటిదాకా, మనం పాండు వెళ్లిపోయాడనే నమ్మాలి,మళ్లీ వొచ్చేదాక.



పాండుకి అశృపూరిత నయనాలతో...
చంద్రం.


            * పాండు బొమ్మలు మీరు ఇక్కడ చూడొచ్చు. (పాండుని గుర్తు చేసుకోవాలనే చనువు తప్ప, ఆ బొమ్మల కాపీరైట్ 
అతిక్రమిస్తున్నానేమో అనే ఆలోచన లేదు. అలాంటిదేదైనా ఉంటే తెలియచేయండి.)   




స్వప్నమే ఆయుధం

Posted by చంద్రం on 10/13/2011 11:39:00 AM


త్వరలో...