మార్పు మంచిదే...
నిజమే...!
అందులో అర్థం ఉంది. మన పక్కన ఉన్న వాళ్లు కూడా అవుననే అనాలి తప్పా, కాదనకూడదు. అంత నిజం అది. ఇంతకీ ఏం మారిందని మనం దిగులు పడిపోతున్నట్టూ?
అబ్బే...!
ఏది మారలేదు కనక?
సర్వం మారిపోయింది. మన ఇంట్లో పేపరేసే కుర్రాడితో సహా ప్రపంచమే మారిపోయింది.ప్రపంచం అంటే గుర్తుకొచ్చిందీ, ఈ మద్య అమెరికా కూడా బాగా మారిందంట. దాంతో మా ఇంటిఓనరు కూడా చాలా మారిపోయాడు. అదేంటంటే, అక్కడ అమెరికాలో వాళ్ల అబ్బాయి మారిపోయాడంట. భూమి ఎంత గుండ్రంగా ఉందోననిపించింది.
ఐనా, మార్పు మంచిదేగా? అలా అనుకునే కదా, ఇన్నాళ్లూ ఎన్నో మార్పులని పంటిబిగివున ఓర్చుకుంటూ వొస్తున్నాం. ఇంతకుముందు పెళ్లవగానే ఉద్యోగంలో చేరితే, పళ్లూడేదాకా అదేఉద్యోగం చేసి, రిటైరయ్యేవాళ్లం. ఇప్పుడలా కుదురుద్దా? ఊహూ! పది కోర్సులైనా చేయాలి. కనీసం పది సాప్ట్ వేర్ లైనా నేర్చుకోవాలి. అంతాచేసి పెళ్లికి ముందు ఉద్యోగంలో చేరితే, కనీసం పెళ్లయ్యేదాకానైనా అది ఉంటుందో, లేదో చెప్పలేం. ఏమంటే...సవాలక్ష మార్పులొస్తుంటాయ్...!
ఒకటి నిజం..! ఎక్కడైనా ఒక మార్పు జరిగిందంటే అది ఇంకెక్కడో ఇంకోదేన్నో మార్చి తీరుతుంది. మనం మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారట్లే? అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్లీ మనం సహజంగానే మారిపోతాం కదా?
అంత దాకా ఎందుకూ? చిన్నప్పుడు మన ఇళ్లమీద ఊరపిచ్చుకలు
వాలి, కిచకిచలాడేవా లేదా? అలాంటిది ఈ తరం పిల్లలకి ఊరపిచ్చుక లంటేనే తెలీనంత మార్పు! అసలీ ఊరపిచ్చుకలు మాయం కావటానికీ గ్లోబలైజేషన్ కీ ఏదైనా సంబంధం ఉందా? ఉండే ఉంటుంది. ఐనా, పిచ్చుకల గురించి అలోచించే తీరిక మనకి లేదు కానీ, అవి మాత్రం ఊరకే ఎందుకు మారిపోతాయి? ఏదో తేడా వొచ్చేఉంటుంది.
ప్రపంచీకరణ వలన ప్రపంచమే ఒక ఇల్లులా మారిపోతుందంటే నిజమేననుకుని హడావుడి పడ్డాం. నిజమే! టీవీలూ, సెల్ ఫోన్ లూ, ఇంటర్నెట్టూ... ఎంత మార్పు? ఇంతకు ముందు ఇళ్లకి ముందు అరుగులుండేవి. చక్కగా కూచుని, దారినపోయే వాళ్లని పలకరిస్తూ మంచీ,చెడూ మాట్లాడుకునే వాళ్లు.
ఇప్పుడలా కుదురుతుందా?
ఒకటి, అలాంటి ఇళ్లు కట్టుకోవడం కుదరదు...రెండు..అంత తీరిగ్గా కూచోడం అంతకన్నా కుదరదు. ఎందుకంటే, మళ్లీ ఎన్నో మార్పులు.ఎక్కడ మార్పు వొచ్చేసిందో కూడా తెలీనంత మార్పు. ప్రపంచం ఒక ఇల్లులా మారిందని సంతోషించాలే తప్ప, ఎలాంటి ఇల్లు ఎలా మారిపోయిందని ఆలోచించకూడదు. సినిమాకి వెళ్లొచ్చేంత వేగంగా పెళ్లి చేసుకోగలమా లేదా? కలిసున్నామో, విడిపోతున్నామో కూడా అర్థం కానంత వేగంగా పరుగెడుతున్నామా లేదా? కళ్లు మూసి, తెరిసేలోగా ఇల్లు కట్టేస్తున్నామా లేదా, బిజినెస్ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఫర్లేదు, పరుగెట్టొచ్చు. కానీ, ఎందుకు పరుగెట్టాలీ? మనకన్నా ముందు తరాలు హాయిగా నడుస్తూనే చక్కగా బ్రతికారు కదా? అన్నీ సాధించారు కదా? అన్నీ అస్వాదించారు కదా? మనకే ఏమయ్యిందీ?
మళ్లీ మార్పు..! గుండె కొట్టుకుంటోదో లేదో కూడా పట్టించుకోలేనంత మార్పు..!
స్థూలంగా చూస్తే ప్రపంచం మారినట్టు కనిపించినా, ఆలోచిస్తే మారింది మనమేనని ఎవరికైనా అర్థమవుతుంది.
మార్పు సహజం..!
నిజమే...!
ఆ మార్పు సహజంగా జరిగితేనే అది మనిషి జీవితాన్ని మరింత సరళంగా మారుస్తుంది. అసహజంగా జరిగే ఏ మార్పు ఐనా సంక్లిష్ఠతకు, అశాంతికీ దారి తీస్తుందే తప్ప, మేలు చేయదు. మనం ఇలా అయోమయంతో కంగారు పడతామేమోననే "మనిషి జీవితాన్ని సరళం చేసేదే శాస్త్రమైనా, మరేదైనా" అని పెద్దలెప్పుడో ఖరాఖండిగా చెప్పారు.
మనం తెగ ఫీలై పోతుంటాం కానీ, శాస్త్రాలు ఇదేం పట్టించుకున్న దాఖలా కనిపించదు. ఫిజిక్స్ లో థర్మోడైనమిక్స్ అని ఒక విభాగం ఉంది. అందులో ఒక సూత్రం ఉంటుంది...Entropy గురించి... !
అదేంటంటే...
"The whole universe is traveling towards an entropy" అని.
ఎంట్రొపీ అంటే ఒక రకమైన disorder.
ఒక నియమానికీ, పద్దతికి లొంగకుండా...క్రమం లేకుండా ఉండటం...! ఇది అర్థం చేసుకోవడానికి ఎన్నో ఉదహరణలు చెప్పుకోవచ్చు. అందరికీ అర్థం కావాలంటే...స్కూల్ కి వె ళ్లేటప్పుడు అయిష్ఠంగా, భారంగా వెళ్లే పిల్లలు స్కూల్ నించి ఇంటికి రావటానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపించడం లాంటిదే ఇది కూడా. విశ్రుంఖలతలో ఉండే ఆనందం! అనైతికతలో ఉండే పారవశ్యం! సహజంగానే మనని అన్ని నియమాలనీ ఉల్లంగించేటట్టు చేస్తుంది.
పర్యవసానం...మనం చూస్తున్నదే...! వినాశనం!!
అది అర్థం చేసుకోగలిగితే, నిజమే అని ఒప్పుకుని తీరుతాం. మనిషి గానీ, ప్రకృతిలో ఉండే ఏ వస్తువూ, పదార్థం గానీ, (ప్లాస్టిక్ లాంటివి కొంచెం మొండికేసినా) చివరికి విశ్వం కూడా కాలంతోపాటూ ఒక్కో దశలో క్షీణించిపోతాయి...! స..హ..జం..గా!
దురదృష్ఠకరమైన విషయమేంటంటే, విశ్వంలో అన్నిటికన్నా త్వరగా క్షీణించేది మన మనసేనేమో! మనిషి స్వభావమే అంతకదా. మనం మారి పోయాం కాబట్టే ప్రపంచం ఇలా మారిందని అనుకోం కదా! చిన్నదైనా, పెద్దదైనా తప్పు చేయడానికి, విలువల్ని వొదులుకోవటానికి తహ తహలాడినట్టు...కారణాలు వెదుక్కున్నట్టు, నియమంగా ఉండటానికి ఇష్ఠపడతామా? కావలిస్తే, తప్పు చేయక తప్పదన్నట్టు, మనకున్న అపారమైన (లోక)జ్ఞానంతో తప్పొప్పుల అర్థాలని మార్చేసుకుంటాం గానీ...కనిపించకుండా పోయిన ఊరపిచ్చుకల గురించి మనం మారడమేంటీ?
నో..నాస్టాల్జియా..!
నో నాన్సెన్స్...!
- చంద్రం
చందూ- మొన్నే 'ది గ్రేట్ మైగ్రేషన్స్' చూసాను. కళ్ళముందే ఒక అద్బతం జరుగుతున్నట్టు ఉంటుందది. వీలైతే చూడు. ఊరపిచ్చుకలు ఎక్కడికి మాయమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
ఆ మూవీ చూడలేదు. చూస్తాను. మనుష్యులే పిట్టల్లా రాలిపోవడం, లేదా వలస పోవడం ప్రతీకాత్మకమే. అయినా, ఆకాశం కిందనించీ ఎక్కడికెళ్తాం?