స్వప్నమే ఆయుధం

Posted by చంద్రం on 8/17/2013 12:29:00 PM


 స్వప్నమే ఆయుధం



నాకు తెలుసు!
ఈ ఎర్రని పెదాలు...
ఏ గాయాల్నీ ముద్దిడలేదని.
రాత్రి కురిసిన వెన్నెల్లో
'తను' ఇచ్చిన
తాంబూలపు ఎరుపు కదూ అది?
నువ్ గుర్తించావ్
నీ దేహాన్ని ఆయుధంగా.
ఐనా...
అంతరాత్మలఖ్ఖర్లేని వాళ్లకి
ఆయుధాలెందుకూ?
చిన్న విస్ఫోటనం లాంటి పతనం.
ఒక జారుముడి విఛ్చేదనంతో
పచ్చని నిన్ను హరింపచేసే
బాహ్య ప్రేరక యత్నం.
నీకు తెలుసు...
తెలివే నీ ఆయుధమని!
ఒక ధుర్బల క్షణం నీ నైతికతని మింగి
నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది.
ఒక అమూర్త సామ్రాజ్యం
నిన్ను అధిపతిగా స్వీకరిస్తుంది.
నువ్వనుకుంటావ్...
గళమే నీ ఆయుధమనీ.
ఏమీలేని తనం
అన్నీ ఉన్న ప్రపంచాన్ని జయిస్తే...
ఒళ్లు బలిసిన పాట కత్తి
గొంతు ఒరలో ఇరుక్కుపోతుంది.
 నువ్వెంత మోదినా
నీ మెడలో గంగడోలు మోగదు.
చిట్ట చివరి స్వప్నం కూడా
నిస్పృహగా తలవాల్చేస్తుంది
వేధాంతపు తేనె పూసిన
కత్తిపదునులాంటి విషాధం
నిన్నూ, నీ స్వప్నాన్నీ వేరు చేస్తుంది.
అప్పుడు తడుముకుంటావ్ నువ్
చీకట్లో..
అచేతనమైన
నీ ఆయుధాన్ని వొదిలి.


- చంద్రం