RULE YOUR SENSES
కాలిమడమ మీదనించి గరిమనాభి కదులుతూ మునివేళ్ళమీదకు చేరుతోంది.
ముందర ఇంకో పాదం...!
నాదే...!
నా సర్వాంగాలనీ మోస్తూ నేలమీద ఆనుతోంది.
నడక...!
controlled falling...!
నా లక్ష్యం...నా ధర్మం...నా జీవనధ్యేయం!
ఎంత హాయిగా ఉందో...నడుస్తోంటే!
ఎన్నాళ్ళు నడిచినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది నాకు.
నేను మళ్ళీ న...డు...స్తు...న్నా...ను.
నడుస్తూనే ఉన్నాను.
నా పాదాలకింద మెత్తటి గడ్డిపూలు నలుగుతూంటే, గిలిగింతగా ఉంది...!
పులకింతగా ఉంది...!
సు...ఖం..గా ఉంది!
పరవశం కలుగుతోంది...తన్మయత్వం కలుగుతోంది!
వద్దు!
వద్దు...!
వొద్దొద్దొద్దొద్దొద్దు.
ఈ గిలిగింత నాకొద్దు.
ఈ పులకింత నాకొద్దు.
ఈ పరవశం వద్దు. ఈ సుఖం...ఈ తన్మయత్వం వద్దు.
నాకిప్పుడు నా పాదాలకింద నలుగుతోన్న గడ్డిపరక కావాలి. దాని తలమీద మొలకెత్తిన గడ్డిపూవు కావాలి. నా పాదాల కింద విరిగిపోతున్న దాని ప్రాణాలు కావాలి. దాని కలలు కావాలి. నా పాదాలను సిగ్గుపడేలా చేసి, దాని తలపై మోసే దాని విశ్వాసం కావాలి. నా కాలికింద వినమ్రంగా నలిగే దాని త్యాగం కావాలి. అది నేర్పించే బ్రహ్మజ్ఞానం కావాలి.
నాకిప్పుడు నడిచేందుకు సంస్కారం కావాలి.
RULE YOUR SENSES...!
0 Responses to "RULE YOUR SENSES"
Leave A Comment :