భూపేన్ హజారికాకు నివాళి
అనగనగా...చా...లా రోజుల క్రిందటి కథ!
అపుడపుడే బొమ్మలతో పాటూ పుస్తకాలూ, సినిమాలూ, సంగీతం వ్యసనాలుగా మారుతున్న రోజులు...ఎనబయ్యవ దశకం చివరివరకూ
నాకు సంగీతం అంటే ఇళయరాజా మాత్రమే అని అనుకునేంత అభిమానం (
వెర్రితనం) ఉండేది. మద్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే అనేక మంది సంగీతకారులను అభిమానించేలోగానే వాళ్లు తెరమరుగైపోవటం, మళ్ళీ కొత్త గాలి వీయడం మాములైపోయింది.
అలాంటి పరిస్థితుల్లో నాకు పరిచయమైన వాళ్లు వరసగా ఎల్.సుబ్రమణియం, ట్రేసీ చాప్ మన్...ఆ వెనకే లాల్గుడి జయరామన్...బాలమురళీ కృష్ణ, పండిట్ శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా, బిస్మిల్లా ఖాన్...ఇలా ఎందరో...!
ఓ వైపు ఇళయరాజా రాగమాలిక, సిందుభైరవి, ఆత్మబంధువు, సాగరసంగమం వరసగా సాగుతుండగానే మరొవైపు వీళ్ళందరూ నా మీద ముప్పేట దాడి చేస్తున్నట్టుగా ఉండేది. ముఖ్యంగా సినిమా సంగీతం నించి నన్ను బయటకు లాగింది ఎల్.సుబ్రమణియం సంగీతమే. ఆ 'ఫ్యూజన్' కథ మరోసారి చెప్తాను.
ఐతే, సినిమాలు విపరీతంగా చూసే అలవాటుకొద్దీ అప్పుడే 'రుడాలి' చూడటం జరిగింది. అప్పటిదాకా (1993 వరకు) నాకు భూపేన్ హజారికా ఎవరో తెలీదు. కల్పన లజ్మీ ఎవరో తెలీదు. అసలు డింపుల్ కపాడియా సినిమాలు కూడా ఎక్కువ చూసినట్టు గుర్తులేదు. అప్పటికి బాలూమహేంద్ర, భారతీరాజా సినిమాలు చూసీ, చూసీ ఇళయరాజాను వినీ, వినీ మైమరిచిపోతుండగా ఉన్నట్టుండి 'రుడాలి' పెద్ద విస్ఫోటనంలా నిశ్శబ్దంగా మస్తిష్కంలో పేలింది.(
ఆ తరువాత అలాంటి పేలుళ్ళు చాలానే జరిగాయి).
'రుడాలి' చూసాకా, సినిమాలు ఇలా కూడా తీస్తారా? అన్నంత దిగ్భ్రమ కలిగింది...
పాటలు ఇలా కూడా పాడతారా అని ఆశ్చర్యం వేసింది.
గబ్బర్ సింగ్ చచ్చిపోతే షోలేలో 'హమ్మయ్య' అనుకుని పండగ చేసుకుంటాం..కదా? ఇక్కడలా కుదరదు...అసలు అమ్జద్ ఖాన్ చనిపోయినప్పుడు 'సానిచెరీ' వొచ్చి గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంటే బిక్కచచ్చిపోయి తీరతాం. డింపుల్ తో పాటూ మనమూ ఏడ్చేస్తాం. ఎవరికోసం అనే అలోచనే రాదు. మనసంతా రాజస్తాన్ ఎడారిలా తయారవుతుంది.
ఇక సినిమా మొత్తం ఒక ఎత్తయితే, భూపేన్ హజారికా సంగీతం మరొక ఎత్తు. విచిత్రం ఏంటంటే, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఆడగొంతు కాకుండా భూపేన్ హజారికా పాట గుండెల్నిపిండెయ్యడం...! రోజుకి సుమారుగా 1,15,200 సార్లు లబ్ డబ్ మని అలసట లేకుండా కొట్టుకునే గుండె భూపేన్ హజారికా పాటతో బరువెక్కిపోతుంది. సినిమా అని తెలిసినా సరే, మన 'దిల్'... '
హూఁ...
హూఁ..మ్..మ్మ'ని బాధగా మూల్గుతూనే ఉంటుంది. దుఃఖం జీవనది లాంటిదని తెలుసుకు
నీ, దుఃఖ్ఖాన్ని ఓర్చుకోవడం నేర్చుకుంటుంది. ఏడవటమెలాగో, ఆ విద్య 'సానిచెరీ' కి ఎలా అబ్బిందో గమనిస్తుంది.
'రుడాలి'లో కళ్ళల్లో దుమ్ము కొట్టుకున్నట్టుగా కనిపించే ఎడారితనాన్ని పట్టి, మనసుకు పరిచయం చేస్తుంది భూపేన్ హజారికా పాట.
వొదలకుండా నీడలా వెంటాడుతుంది.
చేతనైతే మర్చిపొమ్మని పందెం కాస్తుంది.
...ఆ వెంటాడే పాటకి
జై...!
భూపేన్ హజారికాకు నివాళి...!!
హాయ్ చందూ... డ్రాయింగ్ చాలా బావుంది. ఆర్టికల్ ఇంకా బావుంది. సానిచెరి ఏడుస్తూనే ఉంటుంది, ఆయన పాట సాగుతూనే ఉంటుంది, నిర్లజ్జగా గంగ పారుతూనే ఉంటుంది.
హాయ్ రమేష్...ధన్యవాదాలు. చాలా మంది గొప్పగా పాడుతుంటారు...రాస్తుంటారు...నటిస్తుంటారు...మనమంతా వాళ్ళని చూసి జేజేలు చెపుతుంటాం. కానీ కొంతమంది మాత్రమే గొప్పగా బ్రతకగలుగుతారు. అలాంటి వాళ్ళే ఎవరికైనా స్ఫూర్తినివ్వగలరు. భూపేన్ పోయారని తెలిసాకా ఆయన మీద ఏదైనా రాయాలని, నెట్ లో వెదికాను. అది చదివాకా బాగా డిస్టర్బ్ అయ్యాను. పాటకి ప్రాణవాయువు ముఖ్యం. అలా ఒక పాటలాగా, కథలాగా, గొప్ప సినిమాలాగా అందరూ బతకలేరు. అందుకు ఒక కారణం...కుదరదు...రెండు...
చేతకాదు కూడా.