అంతా ఇంతే...
ఒక పే...ద్ద
కొండ ఉంది.
కిందంతా లోయ!
అంచున నిలబడి ఒక వ్యక్తి...! దేన్నో తేరిపారా చూస్తున్నాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చాడు. నిలబడి చూస్తున్న వ్యక్తినీ, ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్నీ చూసాడు. ఎప్పుడూ ఉండేదే తప్పా పెద్దగా చూడాల్సిందేమీ కనపడలేదు.
"సార్...ఏం చూస్తున్నారో ?"
"... ... ... ?"
మొదటి వ్యక్తి మాట్లాడలేదు. రెండో వ్యక్తికి సంగతి అర్థమయింది. ఇదేదో కొండ దూకే బాపతులా ఉంది అనుకుని, ఏవైనా నాలుగు మాటలు చెప్తామనుకున్నాడు.
"ఇంతకీ ప్రాబ్లం ఏంటో?"
" ... ... ... "
రెండో వ్యక్తికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. "చూడండి సార్, మీకు చెప్పేటంత వాణ్ని కాకపోవచ్చు. కానీ సమస్యలనేవి అందరికీ వస్తాయి. మీకు తెలుసా, అదేదో డేశంలో ఒకావిడ...పాపం, కాళ్లూ,చేతులూ లేకపోయినా ముక్కుతో బొమ్మలు గీసి గో..ప్ప పేరు తెచ్చుకుందిట. ఆ మద్య రెండు చేతులూ లేని ఒకతను పట్టుదలతో శ్రమించి, స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ప్రైజ్ కూడా తెచ్చుకున్నాడట....ఐనా..." రెండో వ్యక్తి ఇంకా ఏదో చెప్పబోతోంటే మొదటి వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. ఇంతెత్తున గయ్య్..న లేచాడు. "ఏమయ్యా, బుద్దుందా నీకూ? నన్ను చూడూ... నా కాళ్లూ, చేతులూ కనిపిస్తున్నాయా? కన్నూ, ముక్కూ, నోరూ అన్నీ సరిగ్గానే ఉన్నాయా, లేదా? అసలు నాకేం తక్కువనీ? ముక్కుతో బొమ్మలు గీయటానికీ, కాళ్లతో అన్నం తినడానికీ నాకేం ఖర్మా? ఫో..ఫోవయ్యా, ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు,జాగ్రత్త!" అని విసురుగా కొండ దిగి, విసావిసా నడుచు కుంటూ ఊరివైపు వెళ్లిపోయాడు. రెండో వ్యక్తికి ఏంచేయాలో పాలుపోలేదు. కొండఅంచున నిలబడి, తదేకంగా చూడాలన్న ఆలోచనని విరమించుకుని, తనూ నెమ్మదిగా కొండదిగి, ఊరివైపు నడిచాడు.
ప్రపంచంలో డబ్బున్నవాళ్లున్నారు...లేని వాళ్లున్నారు...చదువున్న వాళ్లున్నారు...లేనివాళ్లున్నారు...తెలివైన వాళ్లూ, లేనివాళ్లూ ఉన్నారు. ఉద్యోగం, పదవీ, భార్యా, పిల్లలూ, పేరు ప్రతిష్ఠలూ, ఆస్తులూ, ఐశ్వర్యాలూ ఉన్నవాళ్లు న్నారు...లేని వాళ్లున్నారు...ఓడలు బళ్లు అవుతుంటాయి. బళ్లు ఓడలు అవుతుంటాయి. ఇదంతా ముందో వెనకో జరిగి తీరుతుంది.
కా...నీ...
సమస్యలు లేని వాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఇది తెలిసీ, తెలియకా చాలా మంది కుంగిపోతుంటారు. తెలిసి కొంతమంది సమస్యని కూడా ఛీట్ చేయడానికి వీలవుతుందేమోనని వ్యర్థప్రయత్నాలు చేస్తుంటారు. ఆలోచిస్తే అన్నీ మనకే అర్థం అవుతాయి.
అనుభవమైతే గానీ తత్వం బోధపడదు కదా.
సర్వేజనా సుఖినో భవంతూ...!!!
చంద్రం గారూ, ఇదో సింగిల్ పేజీ కథలా ఉంది. మీరు కథ లో ఏదో మెలికపెట్టి, చివరికి మంచి ముగింపునిచ్చారు. చాలా బాగుంది. మీ కొత్త బ్లాగ్ తెలుగు జాబిలికి నా శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతున్నాను.
- మురళి
Hello chandram, baaga raasaaru. keep writting. -Praveen