రచ్చబండ - అన్నన్నా...

Posted by చంద్రం on 9/24/2011 06:48:00 PM



ప్రతీ ఉద్యమం ఒక స్వాతంత్ర్య సంగ్రామం కాజాలదు...

ఎవరు పడితే వాళ్లు గాంధీలు కాలేరు...!



              అది అవినీతి మీద పోరు ఐనా సరే...మరొకటైనా సరే...! 

            అసలు అన్నాహజారేని గాంధీతో ఎందుకు పోల్చాలో, ఎలా పోల్చాలో...అసలు ఆ అవసరమేంటో అర్థం కాదు. సత్యానికీ, ధర్మానికీ, స్వేఛ్చకీ గాంధీ ఒక ప్రతీక. మీడియా వాళ్లు అత్యుత్సాహంతో సొంతంగా బిరుదులు ఇవ్వడం మాని, జరుగుతున్న పరిణామాలను సహేతుకంగా చూడకపోతే జనం వెర్రిగొర్రెల్లా పూనకం తెచ్చుకోక మరేం చేస్తారు? ఉన్మాద స్థాయికి చేరుకున్న ఏ ఉద్యమమైనా అరాచకత్వాన్ని కాక దేన్ని ప్రేరేపిస్తుందో అన్నాకి తెలియదా? మీడియా ఎంత ఎగిరిస్తే అంత ఎగరటమే తప్ప అసలు ఈ ఉద్యమాలకి ఒక ఆదీ అంతం ఏమైనా ఉందా? ముందుగా ఉద్యమాల్లోంచి మీడియా ప్రేరణని, ఓట్ల లెక్కలనీ తీసేస్తే తప్ప ఉద్యమకారుల సహేతుకతని, నాయకత్వ సామర్ధ్యాన్నీ విశ్వసించలేని పరిస్థితిని చూస్తున్నాం ఇప్పుడు.

             ప్రతీ ఉద్యమానికీ ఒక ప్రత్యేక నేపథ్యం, పరిస్థితులూ ఉన్నట్లే, ప్రతీ ఉద్యమకారుడు అందుకనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది. మారుతున్న పరిస్థితులను చూస్తే ముల్లుని ముల్లుతోనే తీయాలనే సంకల్పానికే గాంధీ ముసుగు వేస్తున్నట్టు ఉందే తప్ప మరోలా లేదు.

            అవినీతిని అంతమొందించాల్సిదే. మంచిదే. ఎవరూ కాదనరు. అదే సమయంలో ఉద్యమాన్ని సమ్మె స్థాయికి దిగజార్చడం ఉద్యమ స్పూర్తికే విఘాతం కలిగిస్తుందని ఎవరూ మరిచిపోకూడదు. ఉద్యమ మార్గదర్శకాలను పక్కదారి పట్టనివ్వకూడదు.

            నా ఉధ్దేశ్యం ఎప్పుడో మొదలవ్వాల్సిన ఉద్యమం ఇప్పుటికైనా ఆరంభమయ్యింది. దానికి ప్రజల ఆకాంక్ష కూడా తోడై, సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి రాగానే గోడదూకి పారిపోయే బాబాలు, విచక్షణ లేకుండా ప్రజాస్వామ్యాన్నీ, ప్రభుత్వ విధానాలని అవహేళన చేస్తూ మాటకి మాటా అన్నట్టుగా విమర్శించే పౌరసమాజం సాటి భారతీయులను ఎటు వైపు నడిపిస్తున్నట్టూ?


            నాకొక కథ గుర్తుకొస్తోంది.

            ఒక చాకలివాడు రోజూ చెరువులో బట్టలు ఉతుక్కునేవాడు.

            అదే దారిలో రోజూ ఉదయాన్నే ఓ పండితుడు స్నానానికో, దేనికో వెళ్తుండేవాడు. ఓ రోజు చాకలివాడు బట్టలు ఉతుకుతోంటే ఆ నీళ్లు ఎగిరి పండితుడి మీద పడ్డాయి. పండితుడికి కోపం వచ్చింది. " ఏంట్రా ఇదీ? " అని కసురుకున్నాడు. చాకలివాడు " ఫో..ఫోవయ్యా.." అనే వుంటాడు. పండితుడికి తను చదువుకున్న చదువంతా ఈ చాకలివాడి ముందు నిరర్ధకమయ్యిందే అని భాధతో కూడిన కోపం వచ్చింది. తన పాండిత్యమంతా ఉపయోగించి చాకలివాడికి అర్ధం కాకుండా తిట్టేసాడు. ఎంత చాకలివాడైనా తక్కువ తినడు కదా...వాడూ పురాణం అందుకున్నాడు.

            అసలు విషయమేంటంటే, ఇదంతా పైనించి చూస్తున్న దేవుడు 'అరెరే...ఈ చాకలివాడు ఉత్తముడైన పండితుణ్ని పట్టుకుని దుర్భాషలాడి, అవమానిస్తున్నాడే' అని కిందకి బయలుదేరాడు...పండితుణ్ని కాపాడటానికి! తీరా దేవుడు కిందకి వొచ్చేసరికి పండితుడూ, చాకలివాడూ ముష్టియుద్దం చేస్తూ కనపడ్డారు. దేవుడు ఒక్క క్షణం ఇద్దర్నీ చూసి, ఇద్దరూ ఒకే సమానమైనప్పుడు ఇద్దరిలో ఎవర్నీ కాపాడనఖ్ఖర్లేదని నిర్ణయించుకుని, వెనుతిరిగి వెళ్లిపోయాడు.

            ఇవ్వాళ అవినీతిపైన పోరాటానికి జనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నారంటే, జనం తప్పకుండా ఒక ఉద్యమాన్ని కోరుకుంటున్నారనీ, ఉద్యమ అవసరాన్ని గుర్తించారనే అర్ధం. ఈ అవినీతి ఉద్యమం ధాటికి కనీసం నలుగురైదుగురు నేరస్థులైనా న్యాయస్థానంలో దోషులుగా నిలబడగలిగారన్నా,వాళ్ల నేరాలకు మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమౌతున్నారన్నా అందుకు సంతోషించాల్సిందే. ఇది ఉద్యమాన్ని వత్తిలా మరింత ఎగదోసే విషయమే. అందులో సందేహం లేదు. ఐతే, ఏ రకంగా చూసినా అవినీతి మీద పోరాటాన్ని ఈ స్థాయికి తీసుకురాగలిగినందుకు ప్రజలు అన్నా హజారేని ఎంతగా ఆరాధిస్తున్నారో, ఉద్యమం పక్కదారి పట్టిన నాడు అంతే తేలిగ్గా తేసుకుంటారని గమనించాలి. అలా కాకుండా ఈ సమస్యకి ఒక ధీర్ఘకాలిక పరిష్కారం దొరికేలా పౌరసమాజం తగిన జగ్రత్త వహించాలి. అంతే కాదు, భవిష్యత్ లో ప్రజాసంక్షేమం కోసం జరిపే మరే ఉద్యమమైనా సరే, దాని విశ్వసనీయతకి ఈ పరిణామాలు గొడ్డలిపెట్టు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ఉద్యమనేతల మీద ఎంతైనా ఉంది.

            ఇక్కడ అత్యంత ముఖ్యమైన మరో సంగతి...అందరూ దృష్టి సారించాల్సిన విషయమేంటంటే...ఎందుకు, ఎలా వారం రోజుల్లో అన్నాహజారే మరో గాంధీ కాగలిగాడో? ఎందుకు పదకొండేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇరోమ్ షర్మిళని ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదో ప్రజలూ, మీడియా ఆలోచించాలి. మణిపూర్ మహిళలు బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిరసన తెలపాల్సిన దుస్థితికి ఎవరు జవాబు చెప్తారూ?

            ఉద్యమకారులమని ముందుకొచ్చే వాళ్ల నిబద్ధతనీ, విశ్వసనీయతనీ నిగ్గుతేల్చుతూనే ప్రజలను సంయమన పరచాల్సిన బాధ్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా మీదే ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వాలూ, నేరస్తులూ రకరకాల రంగుల్లో, కొత్తకొత్త పధ్దతుల్లో నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నా, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మారకపోవడం ముఖ్యమైన లోపమనేది ఎవరూ కాదనలేని నిష్టురసత్యం. చట్టాలు చేయడానికి పూనుకునే ముందు చేయవలసిన ముఖ్యమైన పని మరొకటి ఉంది. అది నేర నిర్వచనాలని
 మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరిదిద్దటం. అసలు జరుగుతున్న నేరాలని నేరాలుగా గుర్తించటానికీ, నిరూపించటానికే న్యాయస్థానాల సమయమంతా వృధా ఐతే నేరస్తులకు శిక్ష పడేదెప్పుడూ...బాధితులకు న్యాయం జరిగేదెప్పుడూ? భూమ్మీద జరిగే ప్రతీ విషయాన్ని మొదటినించీ మళ్లీ కొత్తగా కనుగొనే ప్రయత్నం చేయకుండా నేరాల్ని సమర్ధంగా ఎదుర్కొంటున్న, నిలువరిస్తొన్న దేశాలను గమనించి, వాటి విధానాలు మనకెంతవరకు పనికొస్తాయో చూసి, చట్టాలని సవరించుకునే ప్రయత్నం చేయటం మేలు కదా.

            ఐతే, చట్టాలు చేయవలసిన ప్రభుత్వాలే అవినీతి మురికికూపంలో కూరుకుపోవడం చూస్తుంటే...దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంది పరిస్థితి. దీనికి ఎప్పటికైనా తప్పనిసరిగా ఒక ధీర్ఘకాలిక పరిష్కారం వెదికి తీరాల్సిందే. ఇప్పుడు మొదలైన అవినీతి సమరం అలాంటి పరిష్కారాన్ని సాధించగలిగితే భారతదేశం ఆర్థికంగానే కాదు, నైతికంగా కూడా మరొక్క ముందడుగు వేయడం ఖాయం. అలా జరగాలని ఆశిద్దాం.

            జై భారత్ !!!

మీ...

-చంద్రం