బై...బై...గణేశా...

Posted by చంద్రం on 9/29/2012 01:29:00 AM


బై...బై...గణేశా...!




మట్టి గణపతివై మాకు

మంచి చెడు నేర్పేవు...

బొజ్జ గణపయ్యవై

కోరికల  తీర్చేవు...

మా ముద్దు గణపయ్య

మళ్ళి రావయ్యా..!

మా బుద్ది నీవయా

మా సిద్ది నీవయా!




(కొండమీది దేవుడు...కొండంత దేవుడు...చాలా రోజుల క్రితం గీసిన బొమ్మ ఇది.)

మా ఇంట్లోనే జీవవైవిధ్య సదస్సు...రండి.

Posted by చంద్రం on 9/27/2012 04:29:00 PM



    జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది కదా...సంధర్బోచితంగా ఉంటుందనిపించింది.

    కాంక్రీట్ వనాల్లోంచి వెలివేయబడుతున్న అనేక పక్షుల, జంతువుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో జీవవైవిధ్యం గురించిన సదస్సు మన హైదరాబాదులో జరగటం ముదావహం అని రాస్తే చా...లా మామూలుగా, ఊకదంపుడుగా ఉంటుంది. అంతకన్నా రొటీన్ గా ఈ సదస్సు ముగిసినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ మన ప్రభుత్వం ఈ సదస్సుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా...త్వరలో ముంబైలాంటి మహానగరాల సరసన చేరటానికి పరుగులు తీస్తున్న హైదరాబాద్ నగరం ఇప్పుడు జరుగుతున్న సదస్సు వలన ఎదైనా (ఇప్పటికైనా)ముందుజాగ్రత్తలు తీసుకోవటానికి ఇది తగిన సమయమని గుర్తిస్తుందేమో? చూద్దాం.

    ఓ పక్కన గనుల కుంభకోణాలు,  ధ్వంసమైపొతూన్న అడవులు, అంతరించిపోతున్న జీవజాతులు, (మరీ విషాధమేంటంటే ఇందులో గిరిజన జాతులు కూడా ఉండటం) మరో పక్క శరవేగంగా విస్తరిస్తోన్న నగర పొలిమేరలు...ఇంతా చేస్తే కడివెడు వానకురిస్తే కదలనివ్వని రహదారులు ఓ పక్క...కుండపోతగా వాన కురిసినా చుక్క నీరు పట్టి దాచుకోలేని ప్రాజెక్టులు మరో పక్కన...ఏది చూసినా మనం ఎన్నో ముందు జగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గట్టిగా నొక్కిఛెప్పేవే.

    ఎన్నైనా చెప్పండి...'ముందడుగు' వేసే విషయంలో మన parameters కొంచెం తికమకగా ఉన్నాయనిపిస్తుంది. ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఓ సారి మనం ముందుకు వెళ్తున్నామా? వెనక్కెళ్తున్నామా అని అలోచించుకోవటానికి కూడా ఇలాగే ఓ సదస్సు ఒకటి జరిగితే బాగుండుననిపిస్తోంది. సరే, ఇది కుంచెం సీరియస్ యవ్వారం కదా...కానీ ఇంతకన్నా సీరియస్ గా ఇలాంటిదే ఒక సదస్సు క్రమం తప్పకుండా మా ఊళ్ళో రోజూ చాలా పంక్చువల్ గా కొన్నేళ్ళుగా జరుగుతోందంటే నమ్ముతారా?

    మీటింగులు లేవు...పబ్లిసిటీ లేదు...ఊరపిచ్చికలు, ఉడుతలు ఏమైపోయాయన్న వెర్రి గందరగోళం లేదు. ఏం చేస్తే ఈ అంతరించిపోతున్న జీవజాలాన్ని కాపాడగలమన్న కన్ ఫ్యూజన్ లేదు...అర్థంకాని ఉపన్యాసాలు లేవు...భీభత్సమైన presentations లేవు. హోటళ్ళు బుక్ చేసే బాధ లేదు...ఎవ్వరూ వొచ్చి చెప్పేది లేదు...కానీ ఒక జీవవైవిధ్య సదస్సు...నిరంతరాయంగా...ఠంచనుగా ఒక దినచర్యలాగా మా ఊళ్ళో, మా ఇంట్లో జరుగుతోంది. గమ్మత్తేమిటంటే...ఈ సదస్సులో ఆయా జీవులు కూడా పాల్గొంటున్నాయి. నమ్మకం లేదా? గత సంవత్సరం  తీసిన ఫోటోల్ని కింద చూడండి.
























    ఇవి ఆ మద్య ఊరెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు.

    మా ఇంటి బాల్కనీ గోడపైనో...మెట్లమీదో...ఎక్కడో ఓ చోట...కాసింత అన్నం...ఓ బెల్లం ముక్క...లేకపోతే కొద్దిగా బియ్యమో...నూకలో వేసి...ఒక చిప్పలో కొన్ని నీళ్ళు పోసి ఉంచటం కొన్నేళ్ళుగా  మా అమ్మ దినచర్యలో ఓ బాగం.


 
    నేను మొదట గమనించలేదు. పాపం ఎప్పుడూ ఉడతల్ని చూడని మా పిల్లలు "డాడీ, ఉడత.." అంటో ఇక దాని వెనక పరుగులు. వీళ్ళని చూసి అది పరుగులు...కాసేపటికి మా పిల్లలు  వేరే ఆటలో పడి అటు వెళ్ళగానే మళ్ళీ ఉడత తయారు. ఊరెళ్ళినప్పుడల్లా మా పిల్లలకు చిన్నపాటి 'జూ' సిద్దంగా ఉంటుంది.




    ఓ పక్క గోడమీది చిప్పలోని నీళ్ళు తాగడానికి రంగురంగుల పిట్టలు ఠంచన్ గా రావడం...మరోపక్క ఉడతలూ...బెల్లం కోసం గోడంతా బారులు తీరే చీమలు...కింద పూలమొక్కల్లో కనిపించే అందమైన కీటకాలు...గోడకావల బురదలో పొర్లే బర్రెలు, వాటితో సయ్యాటలడే కొంగలూ, పక్కనే ఉన్న స్కూల్ కాంపౌండ్ లో తిరిగే మేకలూ...వెరసి మొత్తంగా మా ఇంట్లో ఒక 'జీవ వైవిధ్య' సదస్సు రోజూ జరుగుతున్నట్టే అనిపించింది నాకు.






    మనం అస్సలు పట్టించుకోం గానీ, మనకు తెలిసిన విషయాలను 'అవును...మాకు తెలుసు' అని చెప్పుకోడానికే మనం ఈ సదస్సులు జరుపుకుంటున్నామేమో అనిపిస్తూంది నాకు. నిజంగా చేయాలంటే, ఏం చేయాలో ఈ ప్రభుత్వాలకు తెలీకనా? మా అమ్మకు తెలిసినపాటి విషయం ఇంతమంది అధికారులకు తెలీదని, అందుకే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారనీ  ఎలా అనుకోగలం?

    డిసెంబర్ 1 వొస్తేగానీ మనకి aids గుర్తుకురాదు. నిండుగా వానలు కురిసి నీళ్ళన్నీ సముద్రం పాలైతేనో...అస్సలు వానల్లేక అలమటించిపోతేనో తప్ప మనకు ప్రాజెక్టులు గుర్తుకురావు. గిరిజనుల ఉనికి గుర్తుకువొచ్చే సమస్యే లేదు. వొచ్చినా ఏంచేస్తాం? పిచికలూ...గ్లోబలైజేషన్ అంటో రాసేస్తాం. అది ఎవడికి అర్థం అవుతుందో, అర్థమై ఏం చేయాలో దేవుడికే తెలియాలిక.

    ఇదంతా ఖర్చు ఎందుకు...సులువుగా ఒక మంచి పరిష్కారం చెప్తాను...సరే, ఎలాగూ మొదలయ్యింది కదా, ఈ సదస్సు గట్రా అయ్యాకా...జీవవైవిధ్యం గురించి నొప్పులు పడే పెద్దమనుష్యులు  మా ఊరికి వొస్తే, మా అమ్మని ఎలాగోలా ఒప్పించి ( ఎందుకంటే...ఇలాంటీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమ్మకి అస్సలు తీరిక ఉండదు...చేతగాని వాళ్ళే మాడ్లాడుతూ ఉంటారనీ, చేతనైన వాళ్ళైతే చేసేస్తుంటారనీ అమ్మ ఎప్పుడూ చెప్పేది నాకు) ఎలాగోలా నాలుగు క్లాసులు ఏర్పాటు చేస్తాను. ఫర్వాలేదు...ఇంటిపనే తప్ప మరేం తెలీదు అనుకోవద్దు. మా అమ్మ మంచి టీచర్ కూడా.

             
     

    బొమ్మలెలా గీయాలని బాపుగారిని అడిగామనుకోండి...ఆయన 'సాధన' అంటారు. ఎవ్వర్ని సాధిస్తే బొమ్మలొస్తాయో తెలీక ఆయన్నే సాధించే మాలాంటి వాళ్ళకి 'అది చేస్తే బొమ్మలేం ఖర్మ...అన్నీ వొస్తాయి కదా' అన్న తెలివిడి మాత్రం ఊంటుంది.  అలాగనీ, ఆ ముక్క ఆ మహానుబావుడికి చెప్పుకోలేం కదా. అందుకనీ (చిన్నపుడు) అమ్మకి చూపించా. అలా ఒక్కసారి నా బొమ్మవంక చూసి..."బొమ్మ గీస్తే ఏ ముక్కకాముక్క లాగా కనిపించకూడదు...బొమ్మంతా ఒకటే ( integrated) అన్నట్టుగా కనిపించాలా" అని వంద art పుస్తకాల గుట్టు విప్పిచెప్పేది.  ఈ రెండు ముక్కలు నాకెన్ని బొమ్మల్ని నేర్పించాయో మీరు ఊహించలేరు. కాబట్టి, అనవసరంగా కంఠశోషపెట్టుకోకండి.  అమ్మనడిగితే గొంతు నొప్పిక్కూడా ఏదైనా మందు చెప్తుంది కానీ...అవసరమా?

    అందుకే...

    అన్నీ ఇచ్చిన భూమితల్లికి, దాన్ని పదిలంగా కాపాడుతున్న మా అమ్మతల్లికి జేజేలు.




***



    (అన్నట్టు...ఇలా బ్లాగులో చాలా ఫోటోలను పెట్టాల్సి వొచ్చినప్పుడు సహజంగానే size పెరిగి, page load అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాంటప్పుడు సాధారణంగా imagesని కావల్సిన sizeకి resize చేసుకుంటుంటాం. ఐతే అంతకన్నా కూడా  imagesని తక్కువ sizeలో save చేసుకోవాలంటే వాటిని విండోస్ లో ఉండే paint లో open చేసి just...save చేయండి. మీ image size దాదాపు సగానికి పైగా తగ్గుతుంది. Image quality కూడా పెద్దగా తగ్గదు. ఇలా చేయడం వల్ల మీ page తొందరగా load అవుతుంది కూడా.)




వినాయక చవితి శుభాకాంక్షలు

Posted by చంద్రం on 9/19/2012 01:36:00 PM




 
ద్వాత్రింశద్గణపతి నామాని 


బాల స్తరుణభక్తౌ చ వీర శ్శక్తి ర్ద్విజ స్తథా
సిద్ధ ఉచ్ఛిష్ట విఘ్నేశౌ  క్షిప్రో హేరంబనామకః ll

లక్ష్మీ గణపతి శ్చైవ మహావిఘ్నేశ్వర స్తథా
విజయః కల్పనృత్త శ్చాప్యూర్ధ్వ విఘ్నేశ ఉచ్యతే ll


 ఏకాక్షరో వర శ్చైవ త్ర్యక్ష రక్షి ప్రదాయకః
హరిద్రాఖ్య శ్చైకదంత స్సృష్టి రుద్దండనామాకః ll


ఋణమోచనకో డుండి  ర్ద్విముఖ  స్త్రిముఖ స్తథా
సింహయోగ శ్చ దుర్గా చ దేవ స్సంకటహారకః ll


ద్వాత్రింశద్విఘ్న రాజాఖ్యా  స్తేషాం ధ్యాన మ థోచ్యతే
ll



అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..!


'కథాకేళి' లో మొదటి 'ఈ బుక్'

Posted by చంద్రం on 9/16/2012 03:30:00 PM



            తెలుగు జాబిలి సాహిత్యం పేజీల్లో మొదలైన 'కథాకేళి' మొదటికథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి 'జుజుమురా' తోనే ఆగిన విషయం గమనించే ఉంటారు. నిజానికి అందుకు కారణం...ఆయా కథలు ఒకసారి ప్రచురించబడ్డాకా తరువాతి కథ వచ్చేసరికి అంతకుముందు అచ్చయిన కథని 'ఈ బుక్' రూపంలో అందించాలని ప్రయత్నించడమే. అదికూడా scan చేసిన పేజీలు కాకుండా చదవటానికి స్పష్ఠంగా కనిపించేలా, సౌకర్యంగా ఉండేలా  అన్ని కథలకు ఒక ప్రామాణికమైన పద్దతిలో అందించడం ఎలా అని ఆలోచించాము. చివరికి ఇప్పుడు అందిస్తున్న 'ఈ బుక్' ఏ రకంగా చూసినా పాఠకులకు పుస్తకం చదువుతున్న అనుభూతిని ఇవ్వగలదని భావించాము. ఒక రకంగా, తెలుగులో తొలిసారిగా మొదలుపెడుతున్న ఈ పద్దతిపై మీ సూచనలు, సలహాలూ తెలియచేయండి. ఒకవేళ మా ప్రయత్నానికి పాఠకుల నించి సరైన స్పందన ఎదురైతే, అందరి అభిప్రాయాలనీ పరిశీలించి మిగతా కథల విషయంలో తగు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాము. మా ప్రయత్నం మి అందరి అభిమానాన్ని చూరగొంటుందని ఆశిస్తూ...


మీ
చంద్రం.




 'జుజుమురా' కథ 'ఈ బుక్' కోసం ఇక్కడ క్లిక్ చేయండి...





Website Copier

Posted by చంద్రం on 9/15/2012 10:03:00 PM



        క్రమం తప్పకుండా  బ్లాగులు రాసేవారికి రాసిన టపాలన్నీ కాపీ, పేస్టు చేసుకోవడం...అవన్నీ వరసక్రమంలో back up తీసుకోవడం నిజంగా శ్రమతో కూడిన పని. అదీకాక ఒక్కోసారి...అ..రు..దు..గా...మన బ్లాగులు కనిపించకుండాపోయే ప్రమాదముంది. అవి ఒక్కోసారి recover చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా  recover  చేసుకోవాలో తెలీక నానా ఇబ్బందిపడేవాళ్ళని అపుడపుడు చూస్తూనే ఉంటాము.

        ఒక రకంగా చెప్పాలంటే మన బ్లాగు లేదా వెబ్ సైట్ ని యథాతదంగా back up తీసి పెట్టుకోగలిగితే అన్నిరకాలుగా మేలు. కానీ ఎలా? అందుకే ఈ టపా.

        మీరు Windows 2000/ XP/ Vista/ Seven ఉపయోగిస్తున్నట్టైతే ఈ లింకుని క్లిక్ చేసి HTTrack అనే ఈ software ని download చేసుకోండి. 

        http://download.httrack.com/httrack-3.46.1.exe

        లేదా ఈ కింద యిచ్చిన లింకుకి వెళ్ళి, మీకు సరిపోయే వెర్షన్ ని download చేసుకోండి. 

        http://www.httrack.com/page/2/

తరువాత...

        Install చేయండి.

తరువాత...

        HTTrack open చేసి, మీ బ్లాగుని ఏ పేరుతో, ఎక్కడ save చేయాలో type చేయండి.

తరువాత...

        మీ బ్లాగ్ address ని HTTrack లో paste చేయండి. లేదా మీ బ్లాగు open చేసి, address bar లో మీ బ్లాగు url ని కాపీ చేసి, HTTrack లో paste చేయండి.

తరువాత...

        మీ బ్లాగు మొత్తం download అయిపోయేదాకా wait చేయండి.

తరువాత...

        మీరు download చేసుకున్న folderలో 'index' అనే file ని open చేసి చూడండి.

మీ బ్లాగు రెడీ...!

        ఇప్పుడు మీరు internet connection లేకపోయినా (off line) మీ బ్లాగుని open చేసుకుని, యథాతదంగా  చూడొచ్చు...browse చేయొచ్చు.




Happiness is real when...

Posted by చంద్రం on 9/12/2012 10:03:00 PM
   


        ఆ మద్య ఒక సినిమా చూసాను. దాని పేరు 'In to the wild'. ఒక నిజజీవిత కథ ఆధారంగా అల్లబడిన సినిమా. చూస్తున్నంతసేపూ మామూలుగానే చూసాను. సినిమా అయిపోతోంటే కూడా మామూలుగానే ఉంటుంది. చమత్కారమైన డైలాగులు గానీ, ఒళ్ళు గగుర్పొడిచే సీన్లు గానీ, భీభత్సమయిన పతాక సన్నివేశాలు గానీ ఏమీ ఉండవు. అదేం పెద్ద విషయం కాదన్నట్టుగానే ఉంటుంది హీరో వ్యవహారం కూడా.

        సినిమా అయిపోతుంది.

        అపుడు తగులుకుంటుంది 'hook' మనకి...చివరగా హీరో తన డైరీలో రాసుకున్న చివరి ఫంక్తులు చదివాక...

        " Happiness is real when it is shared".

        నాకు అర్థం అయినంతమటుకూ సినిమా చూసినవాళ్ళెవరైనా ఆ తరువాత ఆ ఫంక్తులు మర్చిపోవడం అసాధ్యం. ఆ తరువాత మన జీవితంలో ఎన్నో సంధర్భాల్లో అవి గుర్తుకువొస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైనా తెలివిగా confuse అయినా మళ్ళీ మనని సరిచేస్తోనే ఉంటాయి. రకరకాల యిజాల  గొడవలో పడి, అన్నీ వొదులుకోమ్మనే వైరాగ్యం నించీ, మొత్తం లాగేసుకోమనే లౌక్యం మద్యన మనం గింజుకుంటున్నపుడు మనల్ని మనం నిటారుగా నిలబెట్టుకోవడానికి గానూ ఈ మాటలు గుర్తుకొస్తూనేఉంటాయి.

        నాకూ గుర్తుకొచ్చాయి...నిన్న ఈ కింద లింకుకి వెళ్ళి, చదివాక.


        నిజానికి ఆ టపా రాస్తున్నపుడు నాకు పెద్ద ఆలోచనేం లేదు. చాలా మందికి పనికొస్తుంది...అంతే! లింకులో శ్రీ భమిడిపాటి గారు ప్రస్తావించిన విషయాలు చదివాకా ఎందుకో పైన రాసినదంతా గుర్తుకొచ్చింది. అయితే జీవితాల్ని మార్చేసెటంత పెద్దవి కానక్కర్లేదు...చిన్నచిన్న విషయాల్లో కూడా ఇంత సంతోషం (మనకీ, ఇతరులకీ) ఉంటుందని ఈ బ్లాగు మొదలెట్టాకా ఇప్పుడే తెలిసింది. ఇంటర్ నెట్ సూత్రం ఉండనే ఉందిగా...sharing is the best. కాకపోతే ఏం share చేస్తున్నామన్నదే ముఖ్యమేమో! ఒక రకంగా ఈ టపా బ్లాగ్ నిర్వహణకి సంబందించి నాకు చాలా విషయాలని నేర్పించింది. సమంజసంగా స్పందించి, దాని ప్రాముఖ్యతని నాకు తెలియచేసిన శ్రీ భమిడిపాటి ఫణిబాబు గారికి నా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు!

మీ

చంద్రం





'వర్డ్ పాడ్' లో తెలుగులో టైప్ చేయడం.

Posted by చంద్రం on 9/10/2012 08:34:00 PM



             మామూలుగా కంపూటర్ లో తెలుగులో టైప్ చేయడం గురించి ఇంటర్ నెట్ లో చాలానే సమాచారం దొరుకుతుంది. అది చాలామటుకు మన తెలుగు టైపింగ్ అవసరాలని తీరుస్తుంది కూడా. అపుడో, ఇపుడో ఏ బ్లాగులోనో అరకొరా తెలుగు టైప్ చేయడం కాకుండా...కాస్త ఎక్కువ...ఏ కథలాంటిదో ఓ పదిపేజీలు రాయాల్సివస్తే చిన్నచిన్న సమస్యలు వొస్తుంటాయి. 'సేవ్' చేసుకోవడం, కావాలనుకున్నపుడు చప్పున ఓపెన్ చేసుకోలేకపోవడం కొంత అసౌకర్యంగా ఉంటుంది.

             అలా కాకుండా మామూలుగా కంపూటర్ లో విండోస్ లో డిఫాల్ట్ గా అందుబాటులో ఉండే 'వర్డ్ పాడ్' లో ఇంగ్లీష్ లో టైప్ చేసినట్టే పేజీలకు పేజీలు తెలుగు కూడా టైప్ చేసుకోగలిగితే ఎంత హాయికదా?

             ఈ కింద ఇచ్చిన లింకుని క్లిక్ చేసి, ఈ సైట్ కి వెళ్ళి, 'AzhagiPlus-Setup' అనే సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకోండి.

             http://azhagi.com/sai/plus/AzhagiPlus-Setup.zip
     
             తరువాత మీ కంప్యూటర్ లో తెలుగు యూనికోడ్ ఫాంట్ ఇన్ స్టాల్ చేసి ఉండనట్టయితే ముందుగా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ కోసం గూగుల్ సెర్చ్ చేయండి. లేదా...

             ఈ కింది లింకుకి వెళ్ళి, తెలుగు యూనికోడ్ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

             http://adityafonts.com/downloads/Ramaneeya_Font.zip
  
            ముందుగా ఈ ఫాంట్ ని విండోస్ లో ఫాంట్స్ ఫోల్డర్ లో కాపీ చేయండి.

             ఇపుడు మీరు ఇన్ స్టాల్ చేసిన Azhagi+ ని ఓపెన్ చేయండి. మీరు తెలుగులో టైప్ చేయాలనుకుంటే తెలుగు hotkey (Ctrl + 3) ప్రెస్ చేయండి. తరువాత Azhagi+ని ( క్లోజ్ చేయకుండా) మినిమైజ్ చేసి, వర్డ్ పాడ్ లో తెలుగు టైప్ చేసి చూడండి. మొదట్లో టైపింగ్ కొంత ఇబ్బంది కావచ్చు. కానీ మిగతా తెలుగు టైపింగ్ టూల్స్ తో పోలిస్తే అంత కష్ఠం కూడా కాదు.

             ఉదాహరణకి...మీరు 'తెలుగు'  టైప్ చేయాలంటే...telugu అని టైప్ చేస్తే సరిపోతుంది. 'టెల్గూ' అని టైప్ చేయాలంటే TelgU అని టైప్ చేస్తే సరి. అంటే T మరియు U కాపిటల్స్ అన్నమాట. సున్న కోసం కాపిటల్ M నొక్కాలి. నాలుగు లైన్లు టైప్ చేస్తే అంతా అర్థమవుతుంది.

             ఐతే, మద్య మద్యన ఇంగ్లీష్ టైప్ చేయాల్సి వస్తే Ctrl+3 నొక్కండి. ఇంగ్లీష్ నించి తెలుగుకి, తెలుగు నించి  ఇంగ్లీష్ కి మారాలంటే Ctrl+3 ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇదంతా అలా టైప్ చేసిందే.